పైలట్ సర్వే తర్వాత ప్రభుత్వ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: వివిధ సంక్షేమ పథకాల్లో అనర్హులు..అక్రమార్కులు లబ్ధి పొందుతున్నట్లు ప్రభుత్వం చేయించిన పైలట్ సర్వేలో తేలింది. ఈ జాబితాలో పీజీ టీచర్లు, ఎస్‌జీటీ, టీజీటీలు, పబ్లిక్‌హెల్త్ మేనేజర్లు, లెక్చరర్లు, ఇద్దరు జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్ ఇంజనీర్లతోపాటు ఐదుగురు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు ఇంకా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్లు కూడా ఉన్నట్టు వెల్లడైంది. ఇలా దాదాపు 50 వేల మంది ఉద్యోగులు(రెగ్యులర్, గ్రాంట్ ఇన్ ఎయిడ్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది, ఇతరులు) ఉన్నట్లు గుర్తించారు. వీరే కాకుండా చివరకు రెండుమూడేళ్ల క్రితం మరణించిన లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలోనూ చేయూత పింఛన్ల మొత్తం ఇప్పటికీ జమ అవుతున్నట్టుగా తాజాగా ప్రభుత్వ పరిశీలనలో వెల్లడైంది.
సంక్షేమ పథకాల నుంచి అక్రమంగా లబ్ధి పొందుతున్న వారిలో సీనియర్ అధికారుల నుంచి కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్టుగా గుర్తించారు. చేయూత పింఛన్లు మొదలు కల్యాణలక్ష్మి, ఉపాధి హామీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాల వరకు అక్రమంగా ప్రభుత్వ సొమ్ముకు గండికొడుతున్నారు. దీంతో వివిధ పేద వర్గాల కోసం ఉదేశించిన పలు ప్రభుత్వ పథకాలు దుర్వినియోగం అవుతున్నాయని స్పష్టమవుతోంది. వివిధ వర్గాల పేదలు, నిర్దేశిత కేటగిరీలకు చెందిన నిజమైన లబ్ధిదారులకు చెందాల్సిన సంక్షేమ పథకాల ఫలాలు పలువురు ప్రభుత్వ అధికారులు మొదలు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేబుల్లోకి చేరుతున్నాయి.
పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా..
వివిధ పథకాల లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయని, ముఖ్యంగా చేయూత పింఛన్లు చనిపోయిన వారికి, అనర్హులకు అందుతున్నాయనే ఫిర్యాదులు రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. ప్రస్తుతం చేయూత కింద దివ్యాంగులకు నెలకు రూ.4 వేలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడి కార్మికులు, ఒంటరి మహిళలు, గీతకార్మీకులు, నేతకార్మీకులు, ఎయిడ్స్ రోగులు, బోదకాల బాధితులు, డయాలిసిస్ పేషెంట్లు, బీడీ టెకేదార్లు రూ.2 వేలు పింఛన్ పొందుతున్న విషయం తెలిసిందే. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఫిజికల్ వెరిఫికేషన్ చేపట్టాలని గ్రామీణ దారిద్య్ర నిర్మూలన సంస్థ (సెర్ప్)ను సర్కార్ ఆదేశించింది. దీంతో పట్టణ ప్రాంతాల్లో సామాజిక తనిఖీ ప్రత్యేక బృందాలతో నిర్వహించిన ‘ఫిజికల్ వెరిఫికేషన్’లో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి.
ఆసరా పింఛన్ల పథకం అమలు మొదలుపెట్టాక పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల వ్యక్తిగత హాజరు అవసరం లేకుండా, వారి బ్యాంక్ ఖాతాల్లోకి పింఛన్ మొత్తాన్ని నెలనెలా బదిలీ చేస్తున్నారు. దీంతో ఈ పింఛన్లు ఎవరికి వెళుతున్నాయి? వారెలా ఉంటారు? జీవించి ఉన్నారా లేదా? తదితర విషయాలను ఫిజికల్‌గా వెరిఫై చేసే అవకాశం అధికారులకు లేకుండా పోయింది. గ్రామీణ ప్రాంతాల్లో మాదిరిగా పింఛన్ పంపిణీ కేంద్రాలకు వెళ్లి వేలిముద్రలు, ముఖ గుర్తింపు, ఇతర రూపాల్లో గుర్తింపు చేయడం ఇబ్బందిగా మారింది.
⇒ హైదరాబాద్‌కు దగ్గరలోని ఓ మున్సిపాలిటీలోని నాలుగు వార్డుల్లో 600 మంది లబ్ధిదారులుంటే..350 మందిని ఖాతాలు పరిశీలిస్తే..అందులో 40 మంది చనిపోయినట్టుగా వెలుగులోకి వచి్చంది. వీరు మరణించి రెండేళ్లు అవుతున్నా వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బు జమ అవుతోంది.
⇒ చేయూత పింఛన్లు పొందుతున్న వారిలో ఇద్దరు జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్ ఇంజనీర్లతో పాటు ఇతరులను అనర్హులని గుర్తించారు. అనర్హులను అరికట్టేందుకు పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది.
పైలెట్ ఆడిట్‌లో..
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డేటాను వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల డేటాతో లింక్ చేసి ఆధార్ సమాచారాన్ని ‘క్రాస్ వెరిఫై’చేసినప్పుడు అక్రమాలు, అనర్హుల వివరాలు బయటపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి జీతాలు, అలవెన్స్‌లు పొందుతున్న 478 రెగ్యులర్, 338 గ్రాంట్ ఇన్ ఎయిడ్ వేతన ఉద్యోగులు, పీజీ టీచర్లు 47 మంది, ఎస్‌జీటీ, టీజీటీలు 71 మంది, పబ్లిక్‌హెల్త్ మేనేజర్లు, లెక్చరర్లతోపాటు ఐదుగురు సివిల్ అసిస్టెంట్‌సర్జన్లు ఇంకా జ్యుడిషియల్ మేజిస్ట్రేట్లు కూడా ఉన్నట్టు తేలింది.అధికారులు, ఉద్యోగులతోపాటు లగ్జరీ కార్లు, మూడంతస్తుల భవనాలు, పెట్రోల్ బంక్‌ల యాజమానులు కూడా ఉండడం ఆశ్చర్యం గొలుపుతోంది. అదికూడా కరీంనగర్ కార్పొరేషన్, సూర్యాపేట మున్సిపాలిటీ, ఆదిలాబాద్ జిల్లాలోని మావల గ్రామం, వనపర్తి జిల్లా ఆత్మకూరులో ప్రభుత్వపరంగా గతంలో నిర్వహించిన ‘పైలెట్ ఆడిట్’లోనే ఇంత మంది అనర్హులు సంక్షేమ పథకాల లబ్ధి పొందుతున్నట్టు తేలింది.
ఉల్లంఘనలు ఇలా..
⇒ నెలకు రూ.లక్షకుపైగా జీతం పొందుతున్న అధికారులు, ఉద్యోగుల తల్లిదండ్రుల్లో కొందరు చేయూత పింఛన్లు పొందుతున్నారు
⇒ కార్లు, ట్రాక్టర్లు, సొంతంగా పెద్ద భవనాలు ఉన్నవారు కూడా ప్రయోజనం పొందారు
⇒ దివ్యాంగులకు మాత్రమే ఇవ్వాల్సిన డిజెబిలిటీ పింఛన్లు, వైకల్యం లేకపోయినా కొందరికి అందుతున్నాయి
⇒ 50 ఏళ్లు కూడా దాటని వారికి కూడా వృద్ధాప్య పింఛన్లు అందుతున్నాయి.
చర్యలేమిటి ?
2026 ఏప్రిల్ నాటికి ముఖ గుర్తింపు, ఇతర తనిఖీల ద్వారా వివిధ కేటగిరీల కింద పింఛన్ పొందే వారి మరణాలు, అనర్హతలు ఆధారంగా మొత్తం 3,01,724 పింఛన్లు తొలగించినట్టు సమాచారం. 2026–27లో కొత్తగా 2 లక్షల మందికి చేయూత పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం నిర్ణయించింది.
⇒ రెగ్యులర్ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, మినిమమ్ టైమ్ స్కేల్, స్టేట్ స్కేల్ పొందుతున్న వారి సంక్షేమ పథకాల లబ్ధిని వెంటనే నిలిపేయాలని ఈ నివేదికలో ప్రభుత్వానికి అధికారులు సిఫార్సు చేశారు. అయితే కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, దినసరి, గౌరవ వేతనం పొందే వారి పట్ల ఎలా చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు..


