సమ్మె విరమిస్తున్నాం: ఆర్టిజన్ల జేఏసీ | Electricity Artisan Workers Withdrawal Of The Strike | Sakshi
Sakshi News home page

సమ్మె విరమిస్తున్నాం: ఆర్టిజన్ల జేఏసీ

Apr 17 2026 1:57 PM | Updated on Apr 17 2026 2:21 PM

Electricity Artisan Workers Withdrawal Of The Strike

సాక్షి, హైదరాబాద్‌: ట్రాన్స్‌కో సీఎండీతో తమ సమస్యలపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం ఆదేశించిన నేపథ్యంలో వెంటనే సమ్మె విరమించాలని నిర్ణయించినట్టు ఆర్టిజన్ల జేఏసీ చైర్మన్ సతీష్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ఆర్టిజన్ల జేఏసీ నాయకులు డిప్యూటీ సీఎంతో సమావేశమయ్యారు. తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి ఉన్నతాధికారులతో చర్చలకు అనుమతించిన డిప్యూటీ సీఎంకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు ఆర్టిజన్ల జేఏసీ కన్వీనర్ సాయిలు ప్రకటించారు.

వేసవిలో విద్యుత్‌ డిమాండ్ పీక్ స్థాయిలో ఉంటుందని.. ఈ సమయంలో అకస్మాత్తుగా సమ్మెకు వెళ్లడం సరైనది కాదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. చర్చల ద్వారానే సమస్యల పరిష్కారం జరుగుతుందన్న భట్టి విక్రమార్క.. ఆర్టిజన్ల సమస్యలపై మానవీయ కోణంలో ప్రభుత్వం ఆలోచన చేస్తుందని తెలిపారు. విద్యుత్ సంఘాల నేతలు ఎప్పుడు వచ్చినా ప్రభుత్వం చర్చలు చేస్తుంది. వారి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు పోతుందని డిప్యూటీ సీఎం అన్నారు.

ఆర్థిక భారం లేకుండా మానవీయ కోణంలో పరిష్కరించగలిగే సమస్యలపై ఆర్టిజన్ల జేఏసీతో ట్రాన్స్‌కో సీఎండీ చర్చలు జరుపుతారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని భట్టి అన్నారు. చర్చల్లో ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఆర్టిజన్ల కో చైర్మన్లు చంద్రారెడ్డి, శ్రీధర్ గౌడ్, చందర్ సింగ్ ఠాకూర్, వైస్ చైర్మన్ సంతోష్, కోశాధికారి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement