చింతల వెంకట రెడ్డి.. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (డబ్ల్యూఐపీవో) ద్వారా అంతర్జాతీయ పేటెంట్లు పొందిన భారత మొట్టమొదటి స్వతంత్ర రైతు. ఆయన రైతుల సంక్షేమమే లక్ష్యంగా చురుకుగా పనిచేస్తూ, వ్యవసాయంలో ఉత్తమ విధానాలను వేలాది మంది అన్నదాతలకు ఉచితంగా బోధిస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించకుండా అధిక దిగుబడి రాబట్టవచ్చని నిరూపిస్తున్నారు. రైతుల కోసం నిలబడిన ఆయన స్ఫూర్తిదాయక గాథను తెలుసుకుందాం..
హైదరాబాద్‌లోని అల్వాల్ ప్రాంతానికి చెందిన ఆర్గానిక్ రైతు చింతల వెంకట రెడ్డి భారత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక ‘మట్టి-కేంద్రీకృత విధానం’తో పేరు తెచ్చుకున్నారు. ఆయన సికింద్రాబాద్ అల్వాల్‌లో 1950 డిసెంబరు 22న సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. చిన్న వయసు నుంచే తండ్రికి పనుల్లో సాయం చేస్తుండేవారు. 12వ తరగతి తర్వాత కుటుంబానికి చెందిన 40 ఎకరాల పొలాన్ని చూసుకోవడానికి చదువు ఆపేశారు.
జీవితాన్ని మలుపుతిప్పిన ఘటన
చింతల వెంకట రెడ్డి 1970 దశాబ్దం చివరలో రసాయన ఎరువులు మట్టి సహజ శక్తిని తగ్గిస్తున్నాయని గుర్తించారు. దీంతో మట్టి ఆరోగ్యం (పోషకాలతో, సమతుల్యంగా ఉండి పంటలకు అవసరమైన అన్ని సహజ లక్షణాలు కలిగి ఉండడం) పునరుద్ధరణపై ప్రయోగాలు ప్రారంభించారు. చివరకు విజయం సాధించారు. మట్టి పునరుద్ధరణకు జెనీవాలోని ఐక్యరాజ్యసమితికి చెందిన డబ్ల్యూఐపీఓ నుంచి అంతర్జాతీయ పేటెంట్లు పొందారు. ఆయన ఆవిష్కరణల్లో ప్రధానమైనది “సోయిల్ స్వాపింగ్”.
టెక్నిక్ ఇదే
భూమిలోని రెండో పొర (4-5 అడుగుల లోతు) నుంచి తీసిన మట్టిలో ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఈ మట్టిని పైపొరపైకి తీసుకురావడం ద్వారా ఎలాంటి రసాయన ఎరువు లేకుండా భూసార పునరుద్ధరణను సాధించారు చింతల వెంకట రెడ్డి.
మట్టి ద్రావణం.. ఎలా పనిచేస్తుంది?
రసాయన స్ప్రేలకు బదులుగా మట్టి ద్రావణ పద్ధతిని చింతల వెంకట రెడ్డి అభివృద్ధి చేశారు. భూమిలోని రెండో పొర నుంచి తీసిన మట్టిని ఎండబెట్టి, వడకట్టి, నీటిలో కలిపి ద్రావణంగా తయారు చేస్తారు. దీన్ని పంటలపై పిచికారీ చేస్తే పలుచని మట్టి పొర ఏర్పడుతుంది. ఈ మట్టిని తినే పురుగులు జీర్ణించుకోలేక చనిపోతాయి. అదే సమయంలో ఖనిజాలు మొక్కకు ఆహారంగా పనిచేస్తాయి.
బియ్యం, గోధుమలో సమృద్ధిగా విటమిన్-డీ
వెంకట రెడ్డి 2021లో సహజ పద్ధతిలో ప్రధాన ఆహార పంటల్లో విటమిన్-డీ ఎక్కువ ఉండేలా చేయడంలో విజయం సాధించారు. సాధారణంగా బియ్యంలో 0 శాతం విటమిన్ డీ ఉంటుంది. ఆయన పంటల్లో 100 గ్రాములకు 102 నుంచి 141 ఐయూ వరకు నమోదైంది. గోధుమలో 100 గ్రాములకు 1832 ఐయూ ఉంటోంది. పోషకాహార లోప సమస్యకు తక్కువ ఖర్చుతో పరిష్కారం కనుగొనడమే లక్ష్యంగా వీటిపై పనిచేశారు.
అంతర్జాతీయ గుర్తింపు
తెలంగాణలోని చింతల వెంకట రెడ్డి వ్యవసాయ క్షేత్రం ప్రపంచ నాయకులకు సందర్శన కేంద్రంగా మారింది.
బిల్ క్లింటన్ (2001): ద్రాక్ష సాగు విధానాన్ని ప్రశంసించారు.
జార్జ్ డబ్ల్యూ బుష్ (2006): హైదరాబాద్ వచ్చిన సమయంలో చింతల వెంకట రెడ్డిని కలిసి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పద్ధతులపై వివరాలు తెలుసుకున్నారు.
పురస్కారాలు
పద్మశ్రీ (2020): వ్యవసాయ ఆవిష్కరణల్లో ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీ అందజేసింది.
డబ్ల్యూఐపీఓ పేటెంట్లు
మట్టి పోషక నిర్వహణ, బయో-ఫోర్టిఫికేషన్ పద్ధతులకు అనేక అంతర్జాతీయ పేటెంట్లు వచ్చాయి. బయో-ఫోర్టిఫికేషన్ అంటే పంటల్లో పోషక విలువలను సహజంగా పెంచే ప్రక్రియ.
ప్రపంచ రికార్డు: అనాబ్-ఎ-షాహీ ద్రాక్ష రకంలో హెక్టారుకు 105 టన్నుల దిగుబడి సాధించారు.
వెంకట రెడ్డి సిద్ధాంతం
“మట్టి అంటే మొక్క కడుపు. మట్టి ఆరోగ్యంగా ఉంటే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. ఆ మొక్కను తినే మనిషి కూడా ఆరోగ్యంగా ఉంటాడు” అనేది ఆయన సిద్ధాంతం.


