
గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్ ఏర్పాటు
మరో మూడు సంస్థలు మంజూరు చేసిన కేంద్రం
బీఆర్‌ఎస్ పార్టీ మునిగిపోతున్న నావ
రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే
మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి కొత్తగా మూడు కేంద్ర సంస్థలు మంజూరయ్యాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో పెద్ద సంఖ్యలో కేంద్ర సంస్థలు ఏర్పాటయ్యాయని చెప్పారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.250 కోట్లతో ‘గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్’నుకేంద్ర వ్యవసాయ శాఖ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుందని వెల్లడించారు. ఇప్పటికే ఐసీఏఆర్, ఐఐఎంఆర్ ఆధ్వర్యంలో మిల్లెట్స్‌పై పరిశోధనలు జరుగుతున్నాయని, వీటిని మరింత విస్తృతం చేసే దిశగా ఈ సంస్థ తోడ్పడుతుందని చెప్పారు.
హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్న ఈ కేంద్రంలో సెంట్రల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ల్యాబ్, ఇంటర్నేషనల్ హాస్టల్, మిల్లెట్స్ మ్యూజియం, రీసెర్చ్ ఫామ్‌లు, ట్రైనింగ్ రూమ్‌లు, ఇంటర్నేషనల్ గెస్ట్ హౌస్ ఉంటాయని వివరించారు. అలాగే జీనోమ్ ఎడిటింగ్ గ్రీన్ హౌజ్‌లు, స్పీడ్ బ్రీడింగ్ ల్యాబ్స్, ఫినోమిక్స్ ల్యాబ్స్ వంటి ఆధునిక పరిశోధనా వసతులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వికసిత్ భారత్ కింద రూ.60 వేల కోట్లతో ఐటీఐల అప్‌గ్రేడేషన్ కోసం హైదరాబాద్‌తో పాటు భువనేశ్వర్, చెన్నై, కాన్పూర్, లుథియానాలో ‘ట్రైనింగ్ ఫర్ ట్రైనర్స్’సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. రైల్వే సెక్యూరిటీకి సంబంధించి ‘కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్‘సంస్థను రూ.300 కోట్లతో సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచి్చందని చెప్పారు.
కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయాలి..
కాళేశ్వరం అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నట్టు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీటలు పడుతున్నాయని, బీఆర్‌ఎస్ పార్టీ మునిగిపోతున్న నావలా మారిందని అన్నారు. కుటుంబ పార్టీలు అత్యంత ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌లో డాడీ–డాటర్ లేఖ ఒక డ్రామా అని కొట్టిపారేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ’ట్రిపుల్ ఆర్ ట్యాక్స్’ పేరిట భారీ వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసు దర్యాప్తు చట్టబద్ధంగా సాగుతుందని అన్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 53 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు ఒప్పందం కుదుర్చుకుందని, అంతకంటే ఎక్కువ సేకరించినా పూర్తి వ్యయాన్ని కేంద్రం భరిస్తుందని హామీ ఇచ్చారు.