వైద్య పరికరాల పరిశ్రమలకు చేయూత

BioAsia 2023: KTR Roundtable With Medical Device Sector Leaders - Sakshi

‘బయో ఆసియా సదస్సు’ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మంత్రి కేటీఆర్‌

తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలపై ప్రతినిధులకు వివరణ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వైద్య పరికరాల తయారీ పరిశ్రమ అభివృద్ధి కోసం సరైన విధానాన్ని తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని.. ఈ రంగానికి తగిన చేయూతనిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కె.తారకరామారావు హామీ ఇచ్చారు. ‘బయో ఆసియా 2023’ సదస్సులో భాగంగా  ఆదివారం హెచ్‌ఐసీసీలో దేశంలోని 20 ప్రముఖ వైద్య పరికరాల తయారీ కంపెనీల ప్రతినిధులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు.

మంత్రి కేటీఆర్‌ అందులో పాల్గొని మాట్లాడారు. దేశంలో వైద్య పరికరాల తయారీ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలు, పారిశ్రామిక సానుకూలతలను వైద్య పరికరాల తయారీ కంపెనీల ప్రతినిధులకు వివరించారు. కాగా దేశంలో వైద్య పరికరాల తయారీ రంగానికి అవసరమైన ప్రోత్సాహం, ఈ రంగం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో చర్చించారు.

ఇందులో మెడ్‌ట్రానిక్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ మైఖేల్‌ బ్లాక్‌ వెల్, రాజీవ్‌నాథ్‌ (ఎండీ, హిందుస్థాన్‌ సినర్జీస్‌), ఆదిత్య బెనర్జీ (ఎండీ, బీబ్రౌన్‌ మెడికల్‌ ఇండియా), సుమీత్‌భట్‌ (సీఈవో, ట్రైవిట్రాన్‌ హెల్త్‌కేర్‌), శిశిర్‌ అగర్వాల్‌ (ఎండీ, టెరుమో ఇండియా), భార్గవ్‌ కోటాడియా (షాజహాన్‌ మెడికల్‌ టెక్నాలజీస్‌), సచిన్‌ గార్గ్‌ (డైరెక్టర్, ఇన్నోవేషన్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీస్‌), జతిన్‌ మహాజన్‌ (ఎండీ, జె.మిత్రా) సహా ఇరవై ప్రముఖ వైద్య పరికరాల కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top