గ్రామం వదిలివెళ్లండి | Attempts were made once again to evacuate the village | Sakshi
Sakshi News home page

గ్రామం వదిలివెళ్లండి

Apr 16 2026 4:31 AM | Updated on Apr 16 2026 4:32 AM

Attempts were made once again to evacuate the village

కోర్టు సిబ్బందితో కలిసి పిటిషనర్ల బంధువుల రాక 

జేసీబీతో ఇళ్లు కూల్చే యత్నం 

గ్రామస్తుల ఎదురుదాడి.. ఐదుగురికి గాయాలు 

గద్వాల జిల్లా చమన్‌ఖాన్‌దొడ్డికి మళ్లీ ఆపద

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ :  జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో సుమారు 8 దశాబ్దాల క్రితం వెలిసిన చమన్‌ఖాన్‌దొడ్డి గ్రామాన్ని ఖాళీ చేయించే ప్రయత్నాలు మరోసారి జరిగాయి. చివరి సారిగా 2024 ఏప్రిల్‌లో కోర్టు, పోలీస్‌ సిబ్బందితో గ్రామాన్ని ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. దీనిపై ‘సాక్షి’లో అదే నెల ఐదో తేదీన ‘ఈ ఊరు మాది.. ఖాళీ చేయండి!’ శీర్షికన ప్రచురితమైన కథనం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఆ ప్రయత్నాలు నిలిచిపోగా.. తాజాగా బుధవారం పునరావృతమైంది. 

కోర్టులో అనుకూల తీర్పు వచ్చిన ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన బంధువులు కోర్టు ఉత్తర్వులు, కోర్టు సిబ్బందితో కలిసి జేసీబీతో గ్రామానికి వచ్చారు. ఇళ్లను కూలగొట్టేందుకు యత్నించడంతో గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకోగా.. పలువురు దాడికి దిగారు. దీంతో వారి బంధువులు ఐదుగురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి ఆలస్యంగా వచ్చిన పోలీసులు గ్రామస్తులను చెల్లాచెదురు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కోర్టు ఫీల్డ్‌ అసిస్టెంట్లు చేసేదేమీ లేక వెనుదిరిగారు. 

గాయపడిన మైబూ, ఖాజా, షేక్‌ ఘనీ, మహ్మద్‌ రఫీ, షేక్‌ బషీర్‌ గద్వాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తమ తాతముత్తాతల నుంచీ ఇక్కడే జీవిస్తున్నామని, ఇప్పుడు ఇళ్లను విడిచి వెళ్లాలంటే ఎక్కడికి పోవాలి.. ఎట్లా బతకాలని స్థానికుడు ఆంజనేయులు, ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజా ప్రతినిధులు తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. చమన్‌ఖాన్‌దొడ్డి గ్రామంలో 200 కుటుంబాల వరకు ఉంటున్నాయి.  

ఇదీ నేపథ్యం.. 
చమన్‌దొడ్డిలో సర్వే నంబర్‌ 129లో 11.02 ఎకరాల భూమి తమదేనని ఖాసిం సాబ్, మదర్‌సాబ్, నబి సాబ్‌ అనే ముగ్గురు వ్యక్తులు 2009లో గద్వాల సీనియర్‌ సివిల్‌ కోర్టులో దావా వేశారు. 2010 ఫిబ్రవరి 5న వీరికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిపై 2012లో గ్రామస్తులు 52 మంది హైకోర్టులో సవాల్‌ చేశారు. 2020లో గ్రామస్తుల పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్‌ చేసింది. ఆ తర్వాత 2021 డిసెంబర్‌లో సదరు భూమిని ఖాళీ చేయించి.. వారికి అప్పగించాలని గట్టు మండల పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. 

మళ్లీ 2024 మార్చిలోనూ ఆదేశాలిచ్చింది. ఈ రెండు పర్యాయాలు ఖాళీ చేయించేందుకు వెళ్లిన పోలీస్‌ సిబ్బందిని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇప్పుడు తాజాగా కోర్టు సిబ్బందితో కలిసి పిటిషనర్ల బంధువులు జేసీబీతో గ్రామానికి చేరుకోగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.  

Advertisement
 
Advertisement
Advertisement