● ఎరువుల వినియోగంపై కొత్తరాగం అందుకున్న ప్రభుత్వం
● ఏపీఏఐఎంఎస్ యాప్‌లో నమోదైతేనే ఎరువులు
హిరమండలం: ఖరీఫ్ సీజన్‌లో యూరియా వినియోగాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. డిమాండ్‌కు తగ్గట్లు యారియా సరఫరా చేయడంలో చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం యాప్ ద్వారా అమ్మకాలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఏపీఏఐఎంఎస్ పేరుతో యాప్‌ను తీసుకొచ్చింది. యారియా వినియోగించడం వల్ల అనర్థాలు ఉన్నాయని, పంటలు విషతుల్యం అవుతాయని, పండించిన పంటలకు ధరలు లభించవని గత ఏడాది రైతులను నేతలు భయభ్రాంతులకు గురి చేశారు. ఈ ఏడాది యాప్ ద్వారా రైతులను ఇక్కట్లకు గురిచేసేందుకు సిద్ధమయ్యారు.
ఇదే జరిగితే కౌలు దారులు, ఎండోమెంట్, ఇనామ్, ఆర్‌వోఎఫ్‌ఆర్ భూముల ను అనుభవిస్తున్న రైతులకు యూరియా, డీఏపీ అందని పరిస్థితి ఏర్పడుతుంది. ఖరీఫ్ సీజన్ ఇప్పటికే మొదలైంది. యాప్ ద్వారానే అమ్మకాలు జరపాలని ప్రభుత్వం ఆదేశించడంతో యారియా ఎక్కడా లభించని పరిస్థితి ఏర్పడింది. ఈ యాప్‌లో గత ఖరీఫ్ ఈ క్రాప్ డేటా మొత్తం వస్తుంది. గత ఏడాది పత్తిసాగు చేసి ఈసారి కూడా పత్తి సాగు చేస్తే యూరి యా ఎకరాకి ఎంత అవసరమో శాస్త్రవేత్త రెకమెండేషన్ ఉంటుంది. ఈ పంట మారిస్తే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఈ సారి సాగు చేయబోయే పంటను ఎంటర్ చేస్తే ఆ పంటకు ఎన్ని బస్తాలు యూరి యా అవసరమో సిఫార్సు వస్తుంది. మొత్తం యూరియా, డీఏపీలను మూడు డోసులుగా రైతులకు ఇస్తారు. డోస్‌కు డోస్‌కు మధ్య 20 రోజుల గ్యాప్ తప్పనిసరి. జిల్లాలో ఖరీఫ్ విస్తీర్ణం 4,59,628 ఎకరాల్లో ఉండగా అందులో వరి సాగు 4,30450 ఎకరాల్లో మెక్కజొన్న 23, 867 ఎకరాల్లో, పత్తి 3140 ఎకరాల్లో సాగు చేస్తారు. మిగిలిన విస్తీర్ణంలో ఇతర పంటలు వేస్తారు. అయితే వీటికి దాదాపు యూరి యా 41,366 మెట్రిక్ టన్నులు అవసరం. యాప్ ద్వారా విక్రయిస్తే 21వేల టన్నులకే పరిమితం చేయవచ్చుననేది ప్రభుత్వం ఆలోచన. వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు యూరియా వినియోగం ఎక్కువగా ఉంటుంది. మొక్కజొన్నకు ఎకరాకు 5 నుంచి 6 బస్తాలు యారియా వినియోగిస్తారు. అయి తే యాప్ ద్వారా ఎకరాలకు 3 బస్తాలకే పరిమితం చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రైతుల నుంచి తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తే అవకాశం ఉంది.


