క్రికెట్‌ మ్యాచ్‌లో అత్యద్భుత దృశ్యం.. అఫ్గాన్‌, తాలిబన్‌ జెండాలతో..?

Taliban, Afghan Flags Fly Side By Side At Unity Cricket Match - Sakshi

కాబూల్: అగస్ట్‌ 15న అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత తొలిసారిగా జరిగిన క్రికెట్ మ్యాచ్‌ సందర్భంగా ఓ అత్యద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పీస్ డిఫెండర్స్, పీస్ హీరోస్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో అఫ్గాన్‌ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన చాలామంది క్రికెటర్లు పాల్గొన్నారు. దీంతో మ్యాచ్‌ చూసేందుకు స్టేడియంలోకి జనం పోటెత్తారు. మ్యాచ్‌ సందర్భంగా ప్రేక్షకులు తాలిబన్, అఫ్గాన్ జెండాలను పక్క పక్కనే ఉంచి ఊపడం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్శించింది. తామంతా ఐక్యంగా ఉన్నామని చాటేందుకే ప్రజలు ఇలా జెండాల ప్రదర్శన చేశారని తాలిబన్‌ అధికారులు పేర్కొనడం గమనార్హం. 


తాలిబన్ల ఆధిపత్య ప్రాంతమైన చమన్ ఉజురి సమీపంలోని స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కు దాదాపు 4 వేల మంది ప్రేక్షకులు హాజరు కాగా, వారిలో మహిళలు లేకపోవడం గమనార్హం. సాధారణ ప్రేక్షకుల కంటే తాలిబన్లే ఈ మ్యాచ్‌ను ఆసక్తిగా తిలకించడం విశేషం. ఈ మ్యాచ్‌లో పీస్ డిఫెండర్స్ జట్టు 62 పరుగుల తేడాతో విజయం సాధించినట్టు ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు సీఈవో హమీద్ షిన్వరి తెలిపారు.


కాగా, తాలిబన్లు దేశాన్ని వశం చేసుకున్న తర్వాత క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపుతారన్న వార్తలు వినిపించాయి. అయితే, ఇప్పుడీ మ్యాచ్‌ జరగడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాలిబన్లు క్రికెట్‌కు ఆమోదం తెలపడం శుభసూచకమని, తాలిబన్లలో మార్పుకు ఇది నాంది అని తాలిబన్‌ సానుభూతిపరులు చెప్పుకుంటున్నారు. 
చదవండి: కోహ్లీ సరికొత్త రికార్డు.. క్రికెట్‌లో అనుకుంటే పొరపాటే..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top