కిం కర్తవ్యం?

T20 World Cup 2022: Team India Report on Indian youngsters who might play 2023 World Cup - Sakshi

టి20కి సీనియర్లు దూరమయ్యే అవకాశం

కుర్రాళ్ల జట్టుతో 2024లో బరిలోకి 

దూకుడే తారకమంత్రంగా ప్రణాళికలు  

ఏడాది వ్యవధిలో జరిగిన గత టి20 ప్రపంచకప్‌కు, ఈ సారి టి20 ప్రపంచకప్‌ మధ్య భారత జట్టు ప్రదర్శనలో తేడా ఏముంది... నాడు గ్రూప్‌ దశలో వెనుదిరగ్గా, ఇప్పుడు మరో అడుగు ముందుకేసి సెమీస్‌ వరకు రాగలిగింది. నాకౌట్‌కు చేరామనే విషయం, పాక్‌పై గెలవడం తప్ప ఓవరాల్‌గా ఆటలో పెద్దగా మార్పేమీ కనిపించలేదు.

ఈ రెండు వరల్డ్‌కప్‌ల మధ్య 35 అంతర్జాతీయ టి2ంలు ఆడిన టీమిండియా ఏకంగా 26 గెలిచి జోరుగా ఆస్ట్రేలియా గడ్డపై అడుగు పెట్టింది. కానీ తుది ఫలితం మాత్రం నిరాశాజనకం. ఈ నేపథ్యంలో వచ్చే వరల్డ్‌కప్‌లో జట్టు రూపురేఖల్లో ఏదైనా మార్పు ఉండవచ్చా, రెండేళ్ల కోసం ఏమైనా కొత్త ప్రయోగాలు ఉంటాయా అనేది ఇప్పుడు చర్చనీయాంశం.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక మెగా ఈవెంట్‌ ముగిసిన తర్వాత అన్ని జట్లలో సహజంగానే కొందరి కెరీర్‌లు ముగుస్తాయి. మంచి విజయాలతో సంతృప్తిగా ముగించేవారు ఒక వైపు...నిరాశగా ఇక సాధించేందుకు ఏమీ లేదని భావనతో మరి కొందరు ఆటకు దూరమవుతారు. ఈ రకంగా చూస్తే టోర్నీలో ఆడిన భారత ప్రస్తుత జట్టు ఎలా ఉండబోతోంది. మున్ముందు కుర్రాళ్లకు ఎలాంటి అవకాశం దక్కుతుంది. ఆటగాళ్ల టి20 ఫార్మాట్‌ రిటైర్మెంట్‌పై ఇప్పుడే మాట్లాడటం సరి కాదంటూ హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ దాటవేసినా... వాస్తవం చూస్తే ఈ ఫార్మాట్‌లో పలు మార్పులు మాత్రం ఖాయం.

ఇద్దరు స్టార్లూ కష్టమే...
కోహ్లి, రోహిత్‌ స్టార్లు కావచ్చు గాక...కానీ రెండేళ్ల తర్వాత జరిగే టి20 వరల్డ్‌ కప్‌ వరకు వారు కొనసాగడం సందేహమే. బీసీసీఐ మరీ కఠినంగా వ్యవహరించకపోవచ్చు గానీ వాస్తవం చూస్తే పరిస్థితి భిన్నంగా ఉంది. 2024 సమయానికి రోహిత్‌కు 37, కోహ్లికి 36 ఏళ్లు ఉంటాయి. రోహిత్‌ ఇప్పటికే ఫిట్‌నెస్‌పరంగా చాలా వెనుకబడి ఉన్నాడు. కెప్టెన్‌గా ఈ సారి దక్కిన అవకాశం ఉపయోగించుకోలేకపోయాడు. పైగా ఆటగాడిగా కూడా విఫలమయ్యాడు. రోహిత్‌ కెరీర్‌కు సంబంధించి వన్డే వరల్డ్‌ కప్‌ ఒక లక్ష్యంగా మిగిలింది. ఇప్పటికిప్పుడు కెప్టెన్సీ మార్పు కూడా ఉండదు కాబట్టి వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో జట్టును గెలిపిస్తే అతను దిగ్గజాల్లో ఒకడిగా నిలిచిపోతాడు.

కాబట్టి పూర్తి ఫోకస్‌ వన్డేలపైనే ఉండవచ్చు. రెండేళ్ల తర్వాత మళ్లీ టి20 కెప్టెన్సీ చేయాలనే ప్రేరణ అతనికి ఏమీ కనిపించడం లేదు. కోహ్లికి ఫిట్‌నెస్‌ సమస్య లేదు కానీ అతను కూడా ఈ ఫార్మాట్‌లో చాలా సాధించేశాడు. వరల్డ్‌ కప్‌ విజేత జట్టులో భాగం కాకపోయినా అదేమీ అతని గొప్పతనాన్ని తగ్గించదు. పైగా వన్డేల్లో ‘ఆల్‌టైమ్‌ గ్రేట్‌’లలో ఒకడైన కోహ్లికి స్వదేశంలో వన్డే వరల్డ్‌ కప్‌లో అసాధారణ ప్రభావం చూపించగలడు. బీసీసీఐ అంతర్గత సమాచారం ప్రకారం వీరిద్దరు ఐపీఎల్‌కు మాత్రం పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. అధికారికంగా రిటైర్మెంట్‌ ప్రకటన చేయకపోవచ్చు గానీ యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకు సిరీస్‌లకు దూరమవుతూ వస్తారు.  

రాహుల్‌పై వేటు పడుతుందా!
తర్వాతి రెండు సిరీస్‌లలో పేర్లను పరిశీలించకపోవడంతో అశ్విన్, దినేశ్‌ కార్తీక్‌ అంతర్జాతీయ టి20 కెరీర్‌ ముగిసినట్లే అని చెప్పవచ్చు. సుదీర్ఘ విరామం తర్వాత గత వరల్డ్‌కప్‌కు ముందు అనూహ్యంగా అశ్విన్‌ పునరాగమనం చేయగా, ఐపీఎల్‌ ప్రదర్శనతో ఫినిషర్‌ కార్తీక్‌ కెరీర్‌ చివర్లో మళ్లీ దూసుకొచ్చాడు. అయితే వీరిద్దరితో కొత్తగా ప్రయత్నించేందుకు ఏమీ లేదు కాబట్టి ఫార్మాట్‌నుంచి తప్పుకోవడం ఖాయం. ఆఖరి నిమిషంలో జట్టుతో చేరిన మొహమ్మద్‌ షమీ టి20 కెరీర్‌ కూడా ఇక ముందుకు వెళ్లదు. రాహుల్‌ పరిస్థితి మాత్రం కాస్త సందేహాస్పదంగా ఉంది. అటు పూర్తిగా తప్పుకోలేడు, ఇటు గొప్పగా ఆడటం లేదు...ఇలాంటి స్థితిలో అతనిపై వేటు పడవచ్చు. అయితే దేశవాళీ, ఐపీఎల్‌లో మళ్లీ చెలరేగితే పునరాగమనం కూడా సాధ్యమే. కొత్త పేస్‌ బౌలర్లు పోటీనిస్తూ దూసుకొస్తున్న తరుణంలో భువనేశ్వర్‌ కుమార్‌ తన సాధారణ ప్రదర్శనతో ఇంకా ఎంత వరకు జట్టులో కొనసాగగలడో చూడాలి.   

వచ్చేది ఎవరు?
రెండేళ్ల తర్వాత పూర్తిగా భిన్నమైన జట్టును మనం చూడవచ్చు. తొలి బంతినుంచి దూకుడు ప్రదర్శిస్తూ విధ్వంసక శైలి ఆటగాళ్లు తమ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. పృథ్వీ షా, సంజు సామ్సన్‌ ఎలాంటి ప్రత్యర్థిపైనైనా చెలరేగగలరు. పంత్‌ దూకుడు గురించి అందరికీ తెలుసు. కివీస్‌తో సిరీస్‌కు ఎంపికైన శుబ్‌మన్‌ గిల్‌ ఇటీవల ముస్తాక్‌ అలీ ట్రోఫీలో కూడా మెరుపు సెంచరీతో సత్తా చాటారు. స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్‌ సుందర్‌ సరిగ్గా సరిపోతాడు. పేస్‌ విభాగంలోనైతే ఉమ్రాన్‌ మొదలు మొహసిన్‌ వరకు ఎన్నో ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. బుమ్రా ఎలాగూ మళ్లీ జట్టులో చేరతాడు. మరో వైపు 32 ఏళ్ల సూర్యకుమార్‌ కెరీర్‌ ఉచ్ఛదశలో ఉన్నాడు కాబట్టి వచ్చే రెండేళ్ల ప్రణాళికలో కూడా అతను భాగం కావడం ఖాయం.

భవిష్యత్తును బట్టి చూస్తే హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీకి అన్ని వైపులనుంచి మద్దతు లభించవచ్చు. ఆల్‌రౌండర్‌గా తన విలువను ప్రదర్శిస్తున్న అతను రోహిత్‌ లేని సమయంలో కెప్టెన్‌గా కూడా రాణిస్తున్నాడు. పైగా ఐపీఎల్‌లో తొలి సారే గుజరాత్‌కు విజేతగా నిలిపిన రికార్డూ ఉంది. కొత్త ప్రణాళికలు, వ్యూహాలు కూడా వంద శాతం ఫలితాలిస్తాయని ఎవరూ చెప్పలేరు. అయితే సెమీస్‌లో ఇంగ్లండ్‌ ఆట చూస్తే టి20లు ఎలా ఆడాలో తెలుస్తుంది. ఆరంభంలో వికెట్లు కాపాడుకొని చివర్లో పరుగులు రాబట్టగలమనే ఆలోచనకన్నా...  ఆసాంతం ధాటిని ప్రదర్శించి కొన్ని ఓటము లు ఎదురైనా నష్టం లేదు. పవర్‌ప్లేలో పవర్‌ఫుల్‌ ఆట చూపించే  ఇదే దూకుడు సరైన సమయంలో జట్టుకు సత్ఫలితాలు అందించడం మాత్రం ఖాయం.   

భవిష్యత్‌ పర్యటన కార్యక్రమం (ఎఫ్‌టీపీ) ప్రకారం భారత జట్టు వచ్చే ఏడాది కేవలం 12 టి20లు మాత్రమే ఆడే అవకాశం ఉంది. 2023లో వన్డే వరల్డ్‌ కప్‌ ఉంది కాబట్టి దానికి సన్నాహకంగా అన్నట్లు 25 వన్డేల్లో టీమిండియా బరిలోకి దిగుతుంది.

 –సాక్షి క్రీడావిభాగం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top