ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం సీఎస్‌కేతో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే నిర్ణీ త 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ (34) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ 3 వికెట్లతో ఆకట్టుకోగా, నితీశ్ కుమార్ 2 వికెట్లు తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (59) మెరుపు అర్థసెంచరీతో ఆకట్టుకోగా, క్లాసెన్ (59) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
వీరిద్దరు మినహా మిగతావారు పరుగులు చేయడంలో విఫలం కావడంతో ఎస్ఆర్‌హెచ్ 200 స్కోరు మార్కును దాటలేకపోయింది. సీఎస్‌కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్, జేమి ఓవర్టన్‌లు చెరో మూడు వికెట్లు తీయగా, ముకేశ్ చౌదరీ 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత ఛేదనను సీఎస్‌కే ధాటిగానే ఆరంభించింది.
ఆరంభంలోనే ఓపెనర్ సంజూ శాంసన్ ఔటైనప్పటికీ వన్‌డౌన్‌లో వచ్చిన ఆయుశ్ మాత్రే 13 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 30 పరుగులు సాధించాడు. మిడిలార్డర్‌లో సర్ఫరాజ్ ఖాన్ (25), మాథ్యూ షార్ట్ (34) పరుగులతో పర్వాలేదనిపించారు. ఆఖర్లో ఓవర్టన్ (16) కాస్త ప్రతిఘటించినప్పటికీ ఎస్ఆర్‌హెచ్ బౌలర్లు కఠినంగా బంతులేయడంతో సీఎస్‌కే ఓటమి దిశగా పయనించింది.


