53 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్స్‌లతో 115
మూడో టి20లోనూ దక్షిణాఫ్రికాదే విజయం
0–3తో సిరీస్ కోల్పోయిన భారత్
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా పర్యటనలో భారత మహిళల క్రికెట్ జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా... బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మూడో మ్యాచ్‌లోనూ ఓడి 0–3తో సిరీస్ కోల్పోయింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికాపై భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. ఓపెనర్ షఫాలీ వర్మ (46 బంతుల్లో 64; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (38 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు.
వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (25 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించింది. అనంతరం దక్షిణాఫ్రికా 16.3 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 193 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ లౌరా వోల్‌వార్ట్ (53 బంతుల్లో 115; 14 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కింది. వోల్‌వార్ట్ 47 బంతుల్లోనే శతకం సాధించి మహిళల టి20ల్లో మూడో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేసింది.
మరో ఓపెనర్ సునె లుస్ (42 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకంతో మెరిసింది. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 15.2 ఓవర్లలోనే 183 పరుగులు జోడించడంతో సఫారీ జట్టు సునాయాసంగా గెలుపొందింది. మహిళల టి20ల్లో ఇది మూడో అతిపెద్ద లక్ష్యఛేదన. వెస్టిండీస్ (213; ఆస్ట్రేలియాపై), ఇంగ్లండ్ (199; భారత్‌పై) ముందున్నాయి. నాలుగో టి20 మ్యాచ్ శనివారం జొహన్నెస్‌బర్గ్‌లోనే జరుగుతుంది.


