ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయింది ‘స్లాప్‌గేట్’ వివాదం. ఆరంభ సీజన్ 2008లో భారత మాజీ బౌలర్లు హర్భజన్ సింగ్ ముంబై ఇండియన్స్, శ్రీశాంత్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు.
శ్రీశాంత్‌ను చెంప దెబ్బకొట్టిన భజ్జీ
ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య నాడు మ్యాచ్ పూర్తైన తర్వాత ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. భజ్జీ కోపంగా శ్రీశాంత్‌ను చెంపదెబ్బ (IPL Slapgate) కొట్టాడు. ఊహించని ఈ పరిణామంతో కంగుతిన్న శ్రీశాంత్ అలా చూస్తుండిపోయాడు.
పశ్చాత్తాపం
దీంతో భజ్జీపై ఐపీఎల్ పాలక మండలి కఠిన చర్యలు తీసుకుంది. దాదాపుగా ఎనిమిది మ్యాచ్‌లు ఆడకుండా అతడిపై నిషేధం విధించింది. ఈ ఘటనపై ఇటీవలే భజ్జీ మరోసారి పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. వెనక్కి వెళ్లే అవకాశం వస్తే తన కెరీర్ నుంచి ఈ మచ్చను తుడిచివేస్తానని.. ఆరోజు జరిగిన దానికి ఇప్పటికే శ్రీశాంత్‌కు 200 సార్లకు పైగా క్షమాపణలు చెప్పానని తెలిపాడు.
అయితే, తాజాగా శ్రీశాంత్ భజ్జీపై సంచలన ఆరోపణలు చేశాడు. ఒకప్పుడు అన్నా అంటూ పిలిచాను గనుకే హర్భజన్‌ను క్షమించానని.. అయితే, అతడికి మాత్రం కృతజ్ఞత లేదంటూ మండిపడ్డాడు. మలయాళ వార్తా సంస్థ మాతృభూమితో మాట్లాడుతూ..
కోటి దాకా సంపాదించాడు
‘‘భజ్జీ గురించి గతంలో నేను ఏ ఇంటర్వ్యూలోనూ మాట్లాడలేదు. ఇదే మొదటిసారి. ఇన్నేళ్లుగా అతడితో నాకు సమస్య రాలేదు. కానీ ఇటీవలే ఆ ఘటనపై అతడు ఓ యాడ్ చేశాడు. దానిని నుంచి దాదాపుగా రూ. 80 లక్షల నుంచి కోటి దాకా సంపాదించాడు.
అంతేకాదు.. నాకు ఫోన్ చేసి ఆ యాడ్ గురించి ఇన్‌స్టా స్టోరీలో పెట్టమని అడిగాడు. ఇందుకు బదులుగా.. ‘నేను నిన్ను క్షమిస్తాను.. కానీ ఆ ఘటనను ఎన్నటికీ మర్చిపోను’ అని భజ్జీకి సమాధానం ఇచ్చాను.
మన పట్ల ఎవరైనా తప్పుగా వ్యవహరిస్తే వారిని క్షమించవచ్చు. కానీ ఆ తప్పును క్షమించకూడదు. లేదంటే వాళ్లు తిరిగి అదే పునరావృతం చేస్తారు. ఇందుకు భజ్జీ మంచి ఉదాహరణ అని చెప్పడానికి నేను సందేహించను.
అన్నా అని పిలిచేవాడిని
ఒకప్పుడు అతడిని అన్నా అని పిలిచేవాడిని. కానీ అతడు ఎప్పుడైతే ఆ యాడ్ చేశాడో అప్పటి నుంచి అస్సలు మాటలు లేవు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతడిని బ్లాక్ చేశాను కూడా!.. నా తల్లిదండ్రులు క్షమాగుణం గురించి చెప్పారు. అంతేకానీ తప్పును క్షమించమని, ఎదుటివాళ్లు చేసిన అవమానాన్ని మర్చిపొమ్మని ఎన్నడూ చెప్పలేదు.
తప్పును క్షమించను
ఇంత చేసినా అతడిపై నాకేమీ ఫిర్యాదులు లేవు. అతడు, అతడి కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలి. ఆ ఘటనను మాత్రం నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను’’ అని శ్రీశాంత్ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా ఐపీఎల్ రూపకర్త లలిత్ మోదీ ఇటీవల స్లాప్‌గేట్ వీడియో విడుదల చేయగా.. శ్రీశాంత్ భార్య భువనేశ్వరి కుమారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


