Photo Courtesy: IPL 2026
ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో ఆ జట్టు ఆడిన చివరి మూడు మ్యాచ్‌లకు డగౌట్‌కే పరిమితమయ్యాడు. అయితే ముంబై ఇండియన్స్ ఇవాళ ఎస్‌ఆర్‌హెచ్‌తో తలపడనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లోనైనా రోహిత్ బరిలోకి దిగుతాడా లేడా అన్నది అనుమానమే. తాజాగా ఈ విషయమై ముంబై ఇండియన్స్ స్పష్టత ఇచ్చింది.
కండరాల గాయంతో బాధపడుతున్న రోహిత్ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదని ముంబై యాజమాన్యం పేర్కొంది. అయితే ఎస్‌ఆ ర్‌హెచ్‌తో మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ నెట్స్‌లో ప్రాక్టీస్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌కు రోహిత్ కచ్చితంగా అందుబాటులో ఉంటాడని ముంబై అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు.
కానీ ముంబై యాజమాన్యం మాత్రం రోహిత్ విషయంలో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదనిపిస్తోంది. రోహిత్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆడించాలని భావిస్తోంది. ఈరోజు ఉదయం వాంఖడే స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ సెషన్‌కు హాజరైన రోహిత్ శర్మ బ్యాటింగ్ జోలికి పోలేదు. వార్మప్, రన్నింగ్ అనంతరం కాసేపు ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ సపోర్ట్ స్టాఫ్‌తో కాసేపు ముచ్చటించి మైదానం వీడాడు.
ఏప్రిల్ 12న ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్ సమయంలో రోహిత్‌కు తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఫిజియో మైదానంలోనే హిట్‌మ్యాన్‌కు ట్రీట్‌మెంట్ చేసినప్పటికీ నొప్పి తగ్గలేదు. దీంతో మరుసటి ఓవర్‌లోనే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన రోహిత్ మరోసారి బ్యాటింగ్‌కు రాలేదు. ఆ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ తేడాతో ఓటమి చవిచూసింది.
ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లాడి కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించి పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఎస్ఆర్‌హెచ్ మాత్రం మధ్యలో పరాజయాలు చవిచూసినా వరుసగా నాలుగు విజయాలు సాధించి జోరు కనబరుస్తోంది. 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, ఒక ఓటమితో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.


