రుతు- సంజూ ఆలింగనం- ధోని (PC: BCCI/CSK)
చెన్నై సూపర్ కింగ్స్.. మహేంద్ర సింగ్ ధోని.. ఈ రెండూ పర్యాయ పదాల లాంటివి అనడంలో అతిశయోక్తి లేదు. ఐపీఎల్ ఆరంభం నుంచి అంతా తానై చెన్నైని ముందుకు నడిపించాడు ధోని. తన సారథ్యంలో రికార్డు స్థాయిలో జట్టును ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు.
సరైన వారసుడు ఎవరు?
అయితే, ధోని (MS Dhoni) కెప్టెన్‌గా తప్పుకొన్న తర్వాత ఇప్పటి వరకు అతడి వారసుడిగా ఎవరూ నిలదొక్కుకోవడం లేదు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)కు 2022లో పగ్గాలు ఇవ్వగా అతడు ఒత్తిడి భరించలేక మధ్యలోనే కెప్టెన్సీ వదిలేశాడు. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్‌ను ధోని స్థానంలో కెప్టెన్‌ను చేశారు.
అయితే, గతేడాది ఐదు మ్యాచ్‌ల తర్వాత గాయం కారణంగా అతడు మధ్యలోనే టోర్నీకి దూరమయ్యాడు. దీంతో ధోని మరోసారి సారథిగా పగ్గాలు చేపట్టగా.. అప్పటికే నష్టం జరిగిపోయింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐపీఎల్-2025లో సీఎస్‌కే పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది.
44 ఏళ్ల వయసులోనూ
ఇక 44 ఏళ్ల వయసులోనూ ధోని చెన్నై తరఫున బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. అయితే, ఐపీఎల్-2026లో సీఎస్‌కే ఇప్పటికే ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. అయినా ఇంత వరకు ధోని ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. పిక్కల్లో గాయం కారణంగా అతడు జట్టుకు దూరంగా ఉంటున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.
ధోని కావాలనే దూరంగా ఉంటున్నాడా?
అయితే, ముంబై ఇండియన్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌కు ముందు ధోని బాగానే ప్రాక్టీస్ చేసినట్లు కనిపించింది. అయినప్పటికీ అతడు బరిలోకి దిగలేదు. కనీసం స్టేడియానికి కూడా రాలేదు. ఈ నేపథ్యంలో ధోని కావాలనే జట్టుకు దూరంగా ఉంటున్నాడా? అనే సందేహాలు తలెత్తగా.. న్యూజిలాండ్ మాజీ పేసర్ సైమన్ డౌల్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
అందుకే ఇలా చేస్తున్నాడు!
క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఎంఎస్ ధోని ఫిట్‌గానే కనిపిస్తున్నాడు. అయినా సరే జట్టుకు దూరంగా ఉంటున్నాడు. కనీసం జట్టుతో కలిసి మైదానానికి రావడం లేదు. డగౌట్‌లోనూ కనిపించడం లేదు.
వీలైనంతగా లైమ్‌లైట్‌కు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. అతడొక దిగ్గజ ఆటగాడు, కెప్టెన్. అయినా సరే ఇలా ఎందుకు చేస్తున్నాడు? కావాలనే అతడు జట్టుకు దూరంగా ఉంటున్నట్లు అనిపిస్తోంది. తాను లేకున్నా జట్టు ముందుకు సాగేలా ఇప్పటి నుంచే అలవాటు చేస్తున్నట్లున్నాడు’’ అని సైమన్ డౌల్ పేర్కొన్నాడు.
Respect ++ 💛💙#MIvCSK #WhistlePodu
pic.twitter.com/xphQe6IpPj— Chennai Super Kings (@ChennaiIPL) April 24, 2026
రుతు, సంజూ మీదే ఫోకస్ ఉండేలా..
‘తలా’ తనకు తానే తన క్రేజ్ తగ్గించుకుని.. కొత్త నాయకత్వ బృందంపై దృష్టి పడేలా చేస్తున్నాడని.. జట్టును వారు తమ చేతుల్లోకి తీసుకునేలా చేస్తున్నాడని డౌల్ అభిప్రాయపడ్డాడు. కాగా గతంలోనూ రుతు కెప్టెన్‌గా ఉన్నా.. మైదానంలో అతడికి సలహాలు, సూచనలు ఇస్తూ ధోని అంతా తానై వ్యవహరించేవాడు.
అయితే, ఈసారి సంజూ శాంసన్ రాకతో ధోని తనపై భారం తగ్గించుకుని.. నాయకత్వ బృందంలో రుతుతో పాటు సంజూ భాగమయ్యేలా చేయడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. కాగా ధోని స్థానంలో సంజూ వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ముంబైతో మ్యాచ్‌లో సంజూ అజేయ సెంచరీ (54 బంతుల్లో 101)తో చెలరేగి.. సీఎస్‌కేకు సీజన్‌లో మూడో విజయం అందించాడు.
చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు


