ఐపీఎల్ 2026లో కేకేఆర్ జట్టు చెత్తగా ఆడుతుంది. వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేదు. వారికి లభించిన ఏకైక పాయింట్ పంజాబ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం వల్ల వచ్చింది.
తాజాగా గుజరాత్ చేతిలో పరాజయం అనంతరం ఆ జట్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్లేఆఫ్స్ చేరుకోవాలంటే మిగిలిన 8 మ్యాచ్‌ల్లో కనీసం 7 గెలవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారం ఇది అంత ఈజీగా జరిగే పని కాదు. వరుస పరాజయాలతో ఆ జట్టు నీరసించిపోయింది. కాన్ఫిడెన్స్ లోపించి అపజయాలను అలవాటు చేసుకుంది.
కేకేఆర్‌కు ఈ దుస్థితి రావడానికి కారణాలేంటా అని పరిశీలిస్తే ఛాంతాడం చిట్టా బయటపడుతుంది. వీరికి దెబ్బలు సీజన్ ప్రారంభానికి ముందే పడ్డాయి. కోట్లు పోసి కొనుక్కున్న బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రాజకీయ కారణాల చేత తొలగించబడ్డాడు. ఆతర్వాత దేశీయ పేసర్లు హర్షిత్ రాణా, ఆకాశ్‌దీప్ గాయాల కారణంగా సీజన్ మొత్తానికే దూరమయ్యారు.
దీనికంటే ముందే యాజమాన్యం వ్యూహాత్మక తప్పిదం చేసింది. కెప్టెన్‌ను ఎంచుకునే విషయంలో తప్పులో కాలేసింది. గత సీజన్ చేదు అనుభవాలను పట్టించుకోకుండా రహానేను కెప్టెన్‌గా కొనసాగించి ఘోర తప్పిదం చేసింది. ఖచ్చితంగా మాట్లాడుకుంటే, రహానే టీ20 ఆటగాడు కాదు. పైగా అతను నాలుగు పదుల వయసుకు దగ్గర పడుతున్నాడు.
ఇలాంటి ఆటగాడిని ఏ ఫ్రాంచైజీ కనీసం జట్టులో కూడా తీసుకోదు. అలాంటి కేకేఆర్ ఏకంగా కెప్టెన్‌గా కొనసాగించి చేతులు కాల్చుకుంటుంది. ఇక్కడ రహానేను నిందించడం పాయింట్ కాదు. అతని ఔట్ డేటెడ్ కెప్టెన్సీ వూహ్యాలు ప్రస్తుత టీ20 యుగానికి పనికిరావన్నదే విషయం. ఇప్పటికీ అతను శక్తివంచన లేకుండా జట్టును విజయపథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నా, ఇతర ఆటగాళ్ల నుంచి అతనికి సహకారం లభించడం లేదు.
గ్రీన్ లాంటి అత్యంత ఖరీదైన ఆటగాడు దారుణంగా విఫలమవుతున్నారు. కోట్లు పోసి కొనుక్కున్న మతీష పతిరణ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఫిన్ అలెన్ మంచి ఆరంభాలు లభిస్తున్నా, సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సామర్థ్యం మేరకు రాణించలేకపోతున్నాడు. మిడిలార్డర్ బ్యాటింగ్‌లో రింకూ సింగ్ చేతులెత్తేశాడు. రహానే వ్యక్తిగతంగానూ శ్రమిస్తున్నప్పటికీ సఫలం కాలేకపోతున్నాడు. ఊరట కలిగించే ఆటగాళ్లు ఎవరైనా ఉన్నారా అంటే అది అంగ్‌కృష్ రఘువంశీ, సునీల్ నరైన్, అడపాదడపా కార్తీక్ త్యాగి మాత్రమే.
ఇవి కాకుండా కేకేఆర్ వ్యూహాత్మకమైన ఎన్నో తప్పిదాలు చేస్తుంది. బౌలింగ్–బ్యాటింగ్ కాంబినేషన్‌లో లోపాలు స్పష్టంగా కనినిస్తున్నాయి. పవర్‌ప్లేలో వికెట్లు తీయలేకపోవడం, మిడిల్ ఓవర్లలో ఒత్తిడి పెంచలేకపోవడం, డెత్ ఓవర్లలో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం ప్రధాన సమస్యగా మారింది. మిడిలార్డర్ బ్యాటింగ్‌లో కన్సిస్టెన్సీ లేదు. దీన్ని వల్ల ఓ మోస్తరు ఆరంభాలు లభించినా ఉపయోగం లేకుండా పోతుంది.
మొత్తంగా వరుస ఓటములతో ఆ జట్టు మానసిక స్థితి పూర్తిగా దెబ్బతింది. ఆటగాళ్లు ఒత్తిడిలో కూరుకుపోయారు. సాహసించి ఏ అడుగు వేయలేకపోతున్నారు. మరికొద్ది మ్యాచ్‌ల వరకు పరిస్థితిలో మార్పు వచ్చే దాఖలాలు కనిపించడం లేదు. కేకేఆర్ అభిమానులు మరో బ్యాడ్ సీజన్ అనుకొని సరిపెట్టుకోవడం తప్పించి చేసేదేమీ ఉండదు.
ఏదైనా మార్పు రావాలంటే, బ్యాటింగ్-బౌలింగ్ కాంబినేషన్‌ను సరి చేయాలి. పవర్ ప్లేలో దూకుడుగా ఆడాలి. వికెట్లు తీయగలగాలి. డెత్ ఓవర్లలో ప్రత్యర్దిని కట్టడి చేయగలగాలి. మిడిలార్డర్ నిలకడ ప్రదర్శించాలి. మొత్తంగా మానసిక స్థితి మెరుగుపడాలి. ఇలా జరిగితే, మిగతా మ్యాచ్‌ల్లో అయినా సత్ఫలితాలు రావచ్చు.


