ఐపీఎల్ 2026 సీజన్‌లో రెండు వరుస విజయాలతో జోష్ మీద కనిపిస్తున్న చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్‌కే) అభిమానులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తన్న ధోని ఎంట్రీకి సంబంధించి సీఎస్‌కే యాజమాన్యం కీలక అప్‌డేట్ ఇచ్చింది. తాజా సమాచారం మేరకు అనుకున్నదానికంటే ముందుగానే ధోని సీఎస్‌కే జట్టుతో జాయిన్ అవ్వనున్నాడు.
ఏప్రిల్ 23న ముంబై ఇండియన్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో ధోని బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. కండరాల గాయంతో టోర్నీలో సీఎస్‌కే ఆడిన తొలి మూడు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న ధోని కేకేఆర్‌తో జరిగిన నాలుగో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని అంతా భావించారు. ధోని ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు కూడా బయటికి వచ్చాయి.
కానీ ధోని కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఆడలేదు. కండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకున్న ధోని ఏప్రిల్ 18న సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ఆడతాడా లేదా అన్నది స్పష్టంగా తెలియదు. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా జరగనున్న మ్యాచ్‌కు సంబంధించి టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడైపోయాయి. అయితే ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో మాత్రం కచ్చితంగా బరిలోకి దిగనున్నాడు.
సర్ఫరాజ్ స్థానానికి ఎసరు?
అయితే ధోని జట్టులోకి రానుండడంతో ఎవరు తమ స్థానాన్ని త్యాగం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. శాంసన్, ఆయుశ్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబేలను పక్కనబెట్టే సాహసం చేయకపోవచ్చు. కాబట్టి సీఎస్‌కే ముందున్న ఆప్షన్ సర్ఫరాజ్ ఖాన్ మాత్రమే. ఈ సీజన్‌లో సర్ఫరాజ్ ఖాన్ అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు.
పరుగులు సాధిస్తున్నప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమవుతున్నాడు. దీంతో ధోని జట్టులోకి వస్తే సర్ఫరాజ్ ఖాన్‌పై వేటు పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక సీఎస్‌కే సీజన్‌లో ఐదు మ్యాచ్‌లాడి రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది.


