సౌతాఫ్రికా కెప్టెన్‌కు భారీ లబ్ది | ICC Rewards South Africa Captain Laura Wolvaardt As Smriti Mandhana Demoted In Women T20I Rankings, Read Story For More Details | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికా కెప్టెన్‌కు భారీ లబ్ది

Apr 28 2026 4:34 PM | Updated on Apr 28 2026 4:53 PM

ICC Rewards South Africa Captain, Smriti Mandhana Demoted In T20I Rankings

ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో సౌతాఫ్రికా కెప్టెన్‌ లారా వోల్వార్డ్ట్‌కు భారీ లబ్ది చేకూరింది. తాజాగా భారత్‌తో ముగిసిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో విశేషంగా రాణించిన ఆమె.. రెండు స్థానాలు మెరుగుపర్చుకొని మూడో స్థానానికి ఎగబాకింది. ఈ సిరీస్‌లో లారా 168కిపైగా స్ట్రయిక్‌రేట్‌తో సెంచరీ, 3 అర్ద సెంచరీల సాయంతో 330 పరుగులు చేసింది.

మరోవైపు సౌతాఫ్రికా సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధన ఓ స్థానం కోల్పోయి, ఐదో స్థానానికి పడిపోయింది. ఈ సిరీస్‌లో మంధన 3 మ్యాచ్‌ల్లో కేవలం 62 పరుగులే చేయగలిగింది. తాజా ర్యాంకింగ్స్‌లో విండీస్‌ బ్యాటర్‌ హేలీ మాథ్యూస్‌ కూడా ఓ స్థానం కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోయింది. టాప్‌-2 బ్యాటర్లుగా జార్జియా వాల్‌, బెత్‌ మూనీ కొనసాగుతున్నారు.

టాప్‌-10లో ఉన్న షఫాలీ వర్మ ఆరో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి పడిపోగా.. టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఓ స్థానం మెరుగుపర్చుకొని పదో స్థానానికి చేరింది.

బౌలర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. పాక్‌ బౌలర్‌ సదియా ఇక్బాల్‌, ఇంగ్లండ్‌ బౌలర్లు సోఫీ ఎక్లెస్టోన్‌, లారెన్‌ బెల్‌ టాప్‌-3లో కొనసాగుతుండగా.. భారత స్టార్‌ స్పిన్నర్‌ దీప్తి శర్మ ఓ స్థానం మెరుగుపర్చుకొని నాలుగో స్థానానికి చేరింది. భారత్‌తో సిరీస్‌లో రాణించిన సౌతాఫ్రికా బౌలర్‌ మ్లాబా 2 స్థానాలు మెరుగుపర్చుకొని దీప్తి శర్మతో పాటు సంయుక్తంగా నాలుగో స్థానం షేర్‌ చేసుకుంది. సౌతాఫ్రికాతో సిరీస్‌లో అద్భుతంగా రాణించిన భారత స్పిన్నర్‌ శ్రీచరణి ఏకంగా 12 స్థానాలు మెరుగుపర్చుకొని 11వ స్థానానికి ఎగబాకింది.

కాగా, తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ 1-4 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్‌లో భారత్‌ కేవలం​ నాలుగో మ్యాచ్‌ మాత్రమే గెలవగా.. సౌతాఫ్రికా మిగతా మ్యాచ్‌లన్నీ గెలిచి సిరీస్‌ కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌ గెలుపులో లారా వోల్వార్డ్ట్‌ కీలకపాత్ర పోషించింది. 

Advertisement
 
Advertisement
Advertisement