సీఎస్‌కే చేతిలో చిత్తు.. హార్దిక్‌ పాండ్యా స్పందన ఇదే | I think that in powerplay: Hardik Pandya On MI's Biggest IPL Defeat To CSK | Sakshi
Sakshi News home page

సీఎస్‌కే చేతిలో చిత్తు.. హార్దిక్‌ పాండ్యా స్పందన ఇదే

Apr 24 2026 8:48 AM | Updated on Apr 24 2026 9:03 AM

I think that in powerplay: Hardik Pandya On MI's Biggest IPL Defeat To CSK

చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో ఘోర పరాజయంపై ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా స్పందించాడు. పవర్‌ ప్లేలో వరుసగా వికెట్లు కోల్పోవడం తీవ్ర ప్రభావం చూపిందన్నాడు. చెన్నై జట్టు అద్భుతంగా బ్యాటింగ్‌ చేసిందని.. అందుకు వారికి క్రెడిట్‌ ఇవ్వాల్సిందేనని పేర్కొన్నాడు.

సంజూ శాంసన్‌ అజేయ సెంచరీ
కాగా ఐపీఎల్‌-2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌ గురువారం సీఎస్‌కేతో తలపడింది. సొంత మైదానం వాంఖడేలో టాస్‌ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. చెన్నై బ్యాటింగ్‌కు దిగింది. 

ఓపెనర్‌ సంజూ శాంసన్‌ అజేయ సెంచరీ (54 బంతుల్లో 101)తో చెలరేగి చెన్నైకి మంచి స్కోరు అందించాడు. సంజూ విధ్వంసం కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి చెన్నై 207 పరుగులు చేసింది.

పవర్‌ప్లే ముగిసేసరికి 
లక్ష్య ఛేదనకు దిగిన ముంబైకి శుభారంభం దక్కలేదు.  తొలి 15 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసిన జట్టు వరుస విరామాల్లో ఓపెనర్లు డానిష్‌ (0), డికాక్‌ (7).. వన్‌డౌన్‌ బ్యాటర్‌ నమన్‌ (0) వికెట్లు కోల్పోయింది. పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు 29 పరుగులు మాత్రమే.

104 పరుగులకే ఆలౌట్‌
ఈ దశలో సూర్య కుమార్‌ (36), తిలక్‌ వర్మ (37) కలిసి నాలుగో వికెట్‌కు 56 బంతుల్లో 73 పరుగులు జోడించారు. అయితే కేవలం 3 పరుగుల వ్యవధిలో వీరిద్దరితో సహా కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (1), రూథర్‌ఫర్డ్‌ (0) అవుటవ్వడంతో ముంబై ఓటమి ఖరారైంది. 

సీఎస్‌కే బౌలర్ల విజృంభణ కారణంగా 19 ఓవర్లలో ముంబై ఇండియన్స్‌ 104 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఫలితంగా పరుగుల తేడా పరంగా ఐపీఎల్‌ చరిత్రలో తమ అతిపెద్ద ఓటమి నమోదు చేసింది.

మా ఓటమికి ప్రధాన కారణం అదే
ఈ నేపథ్యంలో ఓటమిపై హార్దిక్‌ పాండ్యా స్పందిస్తూ.. ‘‘పవర్‌ ప్లేలో వరుసగా వికెట్లు కోల్పోయిన తర్వాత కోలుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా ఛేదనలో ఇలా జరగడం బ్యాటర్లపై ఒత్తిడిని పెంచుతుంది. నేను.. పిచ్‌ను సాకుగా చూపి తప్పించుకునే రకం కాదు.

చెన్నై ఆటగాళ్లు అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. ఇదే వికెట్‌ మీద వాళ్లు 207 పరుగులు సాధించారు. మేమే మెరుగ్గా బ్యాటింగ్‌ చేయాల్సింది. మా స్పిన్నర్లు మెరుగ్గానే బౌలింగ్‌ చేశారనుకుంటున్నా. చెన్నై ఓపెనర్‌ సంజూ అత్యద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు.

వాళ్ల బ్యాటర్లంతా తలా ఓ చెయ్యి వేసి స్కోరును 200 దాటించారు. పవర్‌ ప్లేలో మేము రాణించి ఉంటే ఫలితం వేరుగా ఉండేదేమో. కానీ అది జరగలేదు. జట్టులో మార్పు గురించి ఇప్పుడే చెప్పలేను. నాయకత్వ బృందంతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం’’ అని తెలిపాడు.   

చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్‌.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు

Advertisement
 
Advertisement
Advertisement