ఐపీఎల్ 2026లో కేకేఆర్ జట్టు దారుణ అనుభవాన్ని ఎదుర్కొంది. ఈ ఎడిషన్‌లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయింది. ఈ ఫ్రాంచైజీ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఎడిషన్‌లో ఇలా జరగలేదు. తొలిసారి కేకేఆర్ ఓ ఎడిషన్‌లో మొదటి ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయింది.
ఈ ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్, లక్నో, సీఎస్‌కే చేతిలో ఘోర పరాజయాలు ఎదుర్కొన్న కేకేఆర్.. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం వల్ల ఒక్క పాయింట్‌ను మాత్రమే సాధించగలిగింది.
19 ఏళ్ల ఫ్రాంచైజీ చరిత్రలో ఇంత దారుణ అనుభవాన్ని ఎన్నడూ ఎదుర్కోని కేకేఆర్ ఈ సీజన్‌లో అజింక్య రహానే నేతృత్వంలో ఎదుర్కొంటుంది. భారీ ధరకు కొనుగోలు చేసిన ఆటగాళ్లు ఘోరంగా విఫలం కావడం.. కొందరు ఆటగాళ్లు సామర్థ్యం మేరకు రాణించలేకపోవడం.. గాయాలు.. గెలుపు మొమెంటమ్ లేకపోవడం.. రహానే నాయకత్వంలో లోపాలు ఈ సీజన్‌లో కేకేఆర్ వరుస పరాజయాలకు కారణాలుగా చెప్పవచ్చు.
తాజాగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ బౌలింగ్‌లో పర్వాలేదనిపించినప్పటికీ.. బ్యాటింగ్‌లో తస్సుమనిపించింది. రహానే స్వయంగా డిమోషన్ తీసుకొని నరైన్‌ను ఓపెనర్‌గా పంపినా, ఎలాంటి సత్ఫలితం రాలేదు. ఆపద్భాందవుడు రఘువంశీ కూడా ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు.
మిగతా బ్యాటర్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారు షరామామూలుగా వైఫలల్యాలను కొనసాగించారు. ఈ మ్యాచ్ ఓటమి నుంచి తేరుకోకముందే కెప్టెన్ రహానేకు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్‌రేట్‌కు గానూ అతని మ్యాచ్ ఫీజ్‌లో రూ. 12 లక్షల కోత విధించారు.
ప్రస్తుతం కేకేఆర్ -1.383 రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో కొనసాగుతుంది. ఈ జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 17న అహ్మదాబాద్ వేదికగా జరుగనుంది.


