మోగిన బడి గంట | - | Sakshi
Sakshi News home page

మోగిన బడి గంట

Jun 16 2026 7:25 AM | Updated on Jun 16 2026 7:25 AM

తొలిరోజు అంతంత మాత్రమే హాజరు

అంగన్‌వాడీల్లో స్వాగత తోరణాలు

చిన్నారులకు పూలతో టీచర్లు స్వాగతం

విద్యార్థులకు పుస్తకాల అందజేత

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: వేసవి సెలవుల అనంతరం సోమవారం బడులు తెరుచుకున్నాయి. తొలిరోజు పాఠశాలకు అంతంతమాత్రమే విద్యార్థులు హాజరయ్యారు. చాలారోజుల తర్వాత పాఠశాలకు రావడంతో చిన్నారులు కొంతసేపు ఏడుస్తూ కనిపించారు. కొద్దిసేపటి తర్వాత మిగతా చిన్నారులతో కలిసి ఆడుకుంటూ మధ్యాహ్నం వరకు హాయిగా గడిపారు. కొద్దిమంది చిన్నారులు తమ తల్లిదండ్రులను వెంటబెట్టుకొని వచ్చారు. చాలాచోట్ల తొలిరోజే పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు పుస్తకాలను అందజేశారు.

అమావాస్య ప్రభావం!

తమ చిన్నారులను బడిలో చేర్పించేందుకు తల్లిదండ్రులు సోమవారం పెద్దగా ముందుకురాలేదు. అమావాస్య రోజున బడులు ప్రారంభం కావడంతోనే పిల్లల్ని బడుల్లో చేర్పించేందుకు వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా చాలా తక్కువ మొత్తంలో అడ్మిషన్లు వచ్చినట్లు సమాచారం. మంగళవారం నుంచి పాఠశాలలో అడ్మిషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు.

అంగన్‌వాడీల్లో స్వాగత తోరణాలు

జీవితంలో మొదటిరోజు బడికి వస్తున్న చిన్నారులకు ఆహ్లాదకరమైన పండుగ వాతావరణం నెలకొనే విధంగా ఏర్పాట్లు చేశారు. కొండాపూర్‌ మండలం హరిదాస్‌పూర్‌, గొల్లపల్లితోపాటు చాలా గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. అనంతరం పాఠశాలకు విచ్చేసిన చిన్నారులకు పూలను అందజేసి స్వాగతం పలికారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement