జహీరాబాద్: కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అసమ్మతి మరోమారు భగ్గుమంది. మండలాల పార్టీ అధ్యక్షుల నియామకాలతో రేగిన అసమ్మతి సోమవారం గాంధీభవన్‌కు చేరింది. నియామకాలు ఏకపక్షంగా జరిగాయంటూ పార్టీ శ్రేణులు మండిపడ్డాయి. నియోజకవర్గంలోని జహీరాబాద్, మొగుడంపల్లి మండలాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు 300 మంది వరకు గాంధీభవన్‌కు తరలివెళ్లి ఆయా మండలాల అధ్యక్షుల నియామకాల పట్ల అభ్యంతరం తెలిపారు. పార్టీ సమావేశాలు నిర్వహించి అందరి అభిప్రాయాలు సేకరించిన అనంతరమే అధ్యక్షులను నియమించాల్సి ఉండగా అందుకు భిన్నంగా ఏకపక్షంగా ప్రకటించడం ఏమిటని పార్టీ పెద్దలను నిలదీశారు. పార్టీకి సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న వారిని పక్కన పెట్టి, కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.
ముఖ్యనేతల భేటీ
అసమ్మతి సెగ గాంధీభవన్ చేరడంతో సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలు, ఐడీసీ చైర్మన్ నిర్మలారెడ్డి పార్టీ ముఖ్య నేతలను గాంధీభవన్‌కు పిలిపించి సమావేశమయ్యారు. సమావేశంలో జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్.గిరిధర్‌రెడ్డి, మాజీమంత్రి చంద్రశేఖర్, ఐడీసీ మాజీ చైర్మన్ ఎం.డి.తన్వీర్, జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఎస్.ఉజ్వల్‌రెడ్డి, పార్లమెంట్ పరిశీలకుడు అజ్మత్‌లతోపాటు జహీరాబాద్, మొగుడంపల్లి మండలాలకు చెందిన నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించకుండా, అభిప్రాయాలు సేకరించకుండా పార్టీ అధ్యక్ష పదవులను ఎలా ప్రకటిస్తారని పార్టీ శ్రేణులు సమావేశంలో నిలదీయడంతో జహీరాబాద్, మొగుడంపల్లి మండలాల పార్టీ అధ్యక్ష పదవుల నియామకాలను నిలిపివేస్తున్నట్లు అజ్మత్ ప్రకటించారు. తిరిగి వారం రోజుల్లో పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించి అధ్యక్షుల నియామకాలు చేపడతామని పేర్కొన్నారు. దీంతో పార్టీ శ్రేణులు శాంతించాయి.
పార్టీలో రెండేళ్లుగా అసమ్మతి రాగం
జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం అసంతృప్తి సెగలు రాజుకుంటూనే ఉన్నాయి. పార్టీ మండలాల అధ్యక్షుల ఎన్నికల సందర్భంగా తిరిగి భగ్గుమన్నాయి. పార్టీలో నాలుగు గ్రూపులు కొనసాగుతున్నట్లు పార్టీ నేతలు, కార్యకర్తలే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. గాంధీభవన్ సాక్షిగా ఇది నిజమే అని మరోమారు రుజువైంది. పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని, పార్టీ కార్యకర్తలకు ఉన్న స్వేచ్ఛతోనే తమ బాధను చెప్పుకున్నారని ఎవరికి వారు చెప్పుకుంటున్నారు. ఆయా మండలాల పార్టీ అధ్యక్షులను ఎంపిక చేసి గ్రూపు రాజకీయాలను, అసమ్మతిని పార్టీ పెద్దలు ఎలా తెరదించుతారో వేచి చూడాల్సిందే.
మండలాల అధ్యక్షుల
ప్రకటనతో వెల్లువెత్తిన అసమ్మతి
జహీరాబాద్, మొగుడంపల్లి
మండలాల నియామకాల నిలిపివేత
గాంధీభవన్‌లో నియోజకవర్గం
ముఖ్య నేతల సమావేశం


