ఇప్పటివరకు జిల్లాకు చేరని వస్త్రం
నాణ్యత నగుబాటే..
నారాయణఖేడ్: పాఠశాలలు తెరిచే నాటికి పుస్తకాలు, ఏకరూప దుస్తులు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ఇప్పటివరకు జిల్లాకు యూనిఫాం వస్త్రం సరఫరా కాలేదు. దీంతో ఏకరూప దుస్తుల పంపిణీ మరింత ఆలస్యం కానుంది. కాగా, ఈనెల 15న పాఠశాలలు పునః ప్రారంభం కానుండగా, విద్యార్థులు పాత యూనిఫాంతోనే బడికి హాజరు కానున్నారు. జిల్లాలో 864 ప్రాథమిక, 199 ప్రాథమికోన్నత, 203 ఉన్నత, 10 ఆదర్శ పాఠశాలల ఉన్నాయి.
గతేడాది వేసవి సెలవులకు ముందే పాఠశాలల్లో విద్యార్థుల కొలతలను విద్యాశాఖ అధికారులు తీసుకున్నారు. ఏప్రిల్‌లోనే మహిళా సంఘాల సభ్యులకు వస్త్రం సరఫరా చేసి వేసవి సెలవుల్లోనే కుట్టే పనులు ప్రారంభించారు. పాఠశాలలు పునఃప్రారంభం నాటికి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో పాటు ఒక జత ఏకరూప దుస్తులను అందించారు. కానీ ఏడాది ఇంకా మహిళా సంఘాల సభ్యులకు వస్త్రాల సరఫరానే కాలేదు. మరో పక్షం రోజుల తర్వాత వస్త్రం జిల్లాకు రానుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. వాటిని మహిళా సంఘం సభ్యులకు సరఫరా చేసి విద్యార్థుల కొలతలు తీసుకొని కుట్టి ఇచ్చే సరికి కనీసం రెండు నెలలపైగా పడుతుంది. మొదటి జత పరిస్థితే ఇలా ఉంటే ఇక రెండో జత యూనిఫాం ఎప్పటికి ఇస్తారో అధికారులకే తెలియని పరిస్థితి.
ప్రారంభం రోజే పాఠ్య పుస్తకాలు
పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు అధ్యాపకులు పాఠ్య పుస్తకాలను అందించనున్నారు. జిల్లాకు సరఫరా అయిన పుస్తకాలు మండల స్థాయికి పంపించి, అక్కడి నుంచి ఇప్పటికే పాఠశాలలకు చేరవేశారు. జిల్లాకు 7,14 లక్షల పుస్తకాలు అవసరం కాగా, 6.95 లక్షలు సరఫరా అయ్యాయి. ఇందులో 97 శాతంగా 5.50 లక్షల పుస్తకాలను పాఠశాలలకు పంపించామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా పాఠ్య పుస్తకాలు సరఫరా కావడం వల్ల బోధనా పరంగా విద్యార్థులకు ఇబ్బందులు తీరనున్నాయి.
వచ్చేదెప్పుడు.. కుట్టేదెప్పుడు.. ఇచ్చేదెప్పుడు..!
వారం రోజుల్లో ప్రారంభం కానున్న పాఠశాలలు
పాత యూనిఫాంతోనే బడికి
ప్రభుత్వం సరఫరా చేసే ఉచిత యూనిఫామ్ నాణ్యతపై విమర్శలు వస్తున్నాయి. రంగు వెలిసిపోవడం, క్లాత్ నాసిరకంగా ఉండటంతో పాటు మహిళా సంఘాలు కుట్టే దుస్తులు విద్యార్థులకు సరిగా సరిపోవడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారు. విద్యార్థికి సరిగా ఫిట్ అయ్యే దుస్తులు ఇవ్వాలని కోరుతున్నారు. అవి ప్రభుత్వం నుంచి వచ్చిన దుస్తులనీ, తామేమీ చేయలేమని టీచర్లు చేతులెత్తేస్తున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల సైజుకు అనుగుణంగా మార్చుకుంటున్నారు.


