వ్యాపారాలకు విస్తరణ దెబ్బ | - | Sakshi
Sakshi News home page

వ్యాపారాలకు విస్తరణ దెబ్బ

Jun 10 2026 7:32 AM | Updated on Jun 10 2026 7:32 AM

ఖేడ్‌లో రోడ్డు వెడల్పు పేరుతో ఇళ్లకు నంబర్లు

నారాయణఖేడ్‌: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న రీతిలో ఖేడ్‌లో రహదారి విస్తరణ పనులు కాస్తా స్థానిక వ్యాపారులకు, రోడ్డు పక్కనివాసితులకు కష్టాల్ని తీసుకొచ్చాయి. ఖేడ్‌లో రహదారి విస్తరణకుగాను కేంద్రం నుంచి రూ.46కోట్ల పైచిలుకు నిధులు విడుదల జరగగా టెండర్ల దశలో ఉంది. రహదారి విస్తరణ పేరుతో రోడ్డుకిరువైపులా ఉండే వ్యాపార దుకాణాలు, నివాసాలను పాక్షికంగా కూల్చివేతలు జరుగుతాయనే ప్రచారం స్థానికుల్లో ఆందోళనలు రేకెత్తిస్తోంది. ప్రచారానికి తగ్గట్లుగానే జాతీయ రోడ్లు ప్రాధికారిక సంస్థకు చెందిన సిబ్బంది ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న ఇళ్లకు 50 అడుగుల చొప్పున మార్కింగ్‌తోపాటు సీరియల్‌ నంబర్లను వేశారు. దీంతో గతానికి భిన్నంగా రహదారులను విస్తరించి కూల్చివేతలు జరుగుతాయన్న ప్రచారంతో ఖేడ్‌ పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో 30 అడుగులు

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పట్టణ వాసులతో సమావేశమై మెజార్టీ ప్రజలకు నష్టం వాటిల్లకుండా రోడ్డుకు ఇరువైపులా ప్రజల కోరిక మేరకు 30 ఫీట్ల వరకు విస్తరణ చేపట్టేందుకు నిర్ణయించారు. మెజార్టీ నష్టం జరిగే వారికి ప్రత్యామ్నాయంగా పాట్లు, ఇతర సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అందుకు నివాసాల వారు అంగీకరించారు. అదే సమయంలో రాజీవ్‌చౌక్‌ నుంచి కొత్త బస్టాండ్‌ వరకు రోడ్డు డివైడర్లను నిర్మించారు. అనంతరం ఎన్నికలు రావడంతో పనులు చేపట్టలేదు.

కొత్తగా 50 ఫీట్ల ప్రచారం

కాగా, ప్రస్తుతం 50 ఫీట్ల మేర విస్తరిస్తామని ప్రచారం జరగడం, మార్కింగ్‌ వేయడంతో వ్యాపారులు, నివాసితులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. నిజాంపేట్‌–నారాయణఖేడ్‌ మీదుగా బీదర్‌ వరకు 161బీ జాతీయ రహదారి నిర్మిస్తున్నారు. పట్టణం నుంచి రహదారి నిర్మిస్తే భారీ నష్టం వాటిల్లుతుందని భావించి పట్టణ సమీపం నుంచి నిర్మాణం చేపట్టారు. దీనికి తోడు ఖేడ్‌ పట్టణానికి రెండు బైపాస్‌ రోడ్లున్నాయి. నూతనంగా రింగ్‌ రోడ్డు కూడా నిర్మిస్తున్నారు. ఇన్ని రహదారులు ఉండగా పాత రహదారి విస్తరణ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కూల్చివేతలు చేపడితే వందల భవనాలకు నష్టం వాటిల్లుతుంది. వ్యాపార, నివాసాల వారికి కోట్లలో నష్టం జరిగి, చాలామంది రోడ్డున పడే పరిస్థితి ఉంది.

30 ఫీట్లలోపే విస్తరించాలి

కాగా, పట్టణ వ్యాపారులు, నివాసాల వారు ఇటీవల సమావేశం నిర్వహించి 30 ఫీట్ల వరకే విస్తరించి వ్యాపార, నివాస సముదాయాలకు నష్టం వాటిల్లకుండా చూడాలని నిర్ణయించారు. అంతకుమించి కూల్చివేతలు చేపడితే భారీగా నష్టం వాటిల్లడంతోపాటు మార్కెట్‌ కోలుకోలేని దెబ్బతింటుందని పేర్కొన్నారు. 161బీ జాతీయ రహదారి, రెండు బైపాస్‌, రింగ్‌ రోడ్డుల నిర్మాణం జరగడం వల్ల పట్టణంలో ట్రాఫిక్‌ భారీగా తగ్గిపోగలదని పేర్కొంటున్నారు. 50 ఫీట్ల విస్తరణను విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. డివైడర్ల వల్ల ఇప్పటికే వ్యాపారాలు దెబ్బతిన్నాయని పేర్కొంటున్నారు.

గతానికి భిన్నంగా మార్కింగ్‌లు

వ్యాపారులు, నివాసితుల ఆందోళన

గతంలో 30 ఫీట్లు.. ప్రస్తుతం 50 ఫీట్లు అంటూ హడావుడి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement