పంట మార్పిడితో ప్రయోజనాలు | - | Sakshi
Sakshi News home page

పంట మార్పిడితో ప్రయోజనాలు

Jun 10 2026 7:32 AM | Updated on Jun 10 2026 7:32 AM

జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్‌

‘సాక్షి’ఫోన్‌ ఇన్‌కు విశేష స్పందన

డీఏఓతో నేరుగా మాట్లాడిన రైతులు

వానాకాలం పంటల సాగుపై సూచనలు, సలహాలు

ప్రశ్న: వర్షాభావ ప్రభావంతో ఆరుతడి పంటలు సాగు చేసుకోమని చెబుతున్నారు. పంట పూత దశలో అధిక వర్షం, తక్కువ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వరి పంట సాగు చేసుకోవచ్చా?

– భీమ్‌ రావు, గ్రా.బాన్సువాడ,

మం. కంగ్టి

శివప్రసాద్‌: జూన్‌, జూలైలో సాధారణం, ఆగస్టు, సెప్టెంబర్‌లో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అతి తక్కువ కాలంలో పంట చేతికొచ్చే వైరెటీలు సాగు చేసుకోవాలి. వర్షాలను తట్టుకుని చేతికొచ్చే పంట రకం వరిని సాగు చేసుకోవాలి. వర్షాలు తక్కువగా ఉన్నందున తెగుళ్లు తక్కువగా వస్తాయి.

సంగారెడ్డి జోన్‌/ సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: రైతులు తమ పొలాల్లో ఒకే రకమైన పంటను కాకుండా కాలానికనుగుణంగా పంటలను మార్పిడి చేస్తూ సాగు చేయడంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్‌ వెల్లడించారు. మంగళవారం ‘సాక్షి’ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. రైతులు నేరుగా ఆయనతో మాట్లాడి తమ సందేహాలను తీర్చుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి మాట్లాడుతూ..ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉండటంతో తక్కువ సమయంలో పంట చేతికొచ్చే రకాలను విత్తుకోవాలని సూచించారు.

ప్రశ్న: పత్తిలో అంతర పంటగా సోయా పంటను సాగు చేయాలంటే ఏ రకమైన విత్తనాలు విత్తు కోవాలి?

గోపాల్‌ రెడ్డి, గ్రా.కక్కర్‌ వాడ,మం. ఝరాసంగం

శివప్రసాద్‌: పత్తిలో అంతర పంటగా జేఎస్‌ 335 రకం సోయాను సాగు చేసుకోవచ్చు. ఆగస్టులో వర్షపాతం చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో పత్తిలో కంది పంటను సాగు చేసుకోవడం చాలా మంచిది. నీటి సౌకర్యం ఉంటే మక్క పంటను కూడా సాగు చేసుకోవచ్చు.

ప్రశ్న: 5 ఎకరాల భూమి ఉంది. ప్రస్తుతం ఏ రకమైన పత్తి విత్తనాలు విత్తు కోవాలి?

– మల్లేశం యాదవ్‌, వినోద్‌ సింగ్‌ ఠాకూర్‌, గ్రా. మం. ఝరాసంగం

శివ ప్రసాద్‌: పత్తిలో అనేక రకాలు మార్కెట్‌లో ఉన్నాయి. 120 నుంచి 135 రోజుల కాలం ఉన్న పంటలను సాగు చేసుకోవడం మంచిది. ఆగస్టులో వర్షపాతం చాలా తక్కువగా ఉన్నందున త్వరగా పంట చేతికి వచ్చే విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.

ప్రశ్న: ఈ ఏడాది కూడా వరి సాగు చేయవచ్చా?

– ప్రవీణ్‌, గ్రా.ఫసల్‌ వాది, మం.సంగారెడ్డి

శివ ప్రసాద్‌: తక్కువ కాలం ఉన్న కేఎన్‌ఏం 1638 అనే వైరెటీని సాగు చేసుకోవాలి. నీటి సౌకర్యం ఉంటే వరి సాగు చేసుకోవచ్చు. ఎకరాకు 32 క్వింటాలు దిగుబడి వస్తుంది.

ప్రశ్న: పత్తి విత్తనాలు ఎప్పుడూ విత్తుకోవచ్చు. యూరియా అందుబాటులో ఉందా?

– మల్లేశం, గ్రా. ఇసిరాబాద్‌ మం.సదాశివ పేట

శివప్రసాద్‌: రెండు వానలు బాగా కురిసిన తర్వాతే పత్తి విత్తనాలు విత్తుకుంటే మంచిది. యూరియా కొరత లేదు. యాప్‌ ద్వారా యూరియాను బుక్‌ చేసుకోవాలి.

ప్రశ్న: ఎరువులు అధిక ధరలకు అమ్ముతున్నారు? కొనుగోలు చేసిన వాటికి బిల్లులు కూడా ఇవ్వటం లేదు. ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

– నరసింహారెడ్డి, గ్రా. ముంగి, మం. న్యాల్‌కల్‌

శివప్రసాద్‌: ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్మినట్లు రుజువైతే షాప్‌ను సీజ్‌ చేస్తాం. కేసులు నమోదు చేస్తాం. కొనుగోలు చేసిన ఎరువులకు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలి.

ప్రశ్న: పత్తి పంటలో అంతర పంటగా ఎలాంటి పంటలు సాగు చేసుకోవాలి? తెగుళ్లు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి?

– దుర్గేష్‌, గ్రా. కన్‌ సాంన్‌ పల్లి, మం.అందోల్‌

శివప్రసాద్‌: మూడు వరుసల పత్తి, ఒక వరుస అంతర పంటగా కంది, సోయాబీన్‌తో పాటు నీటి సౌకర్యం ఉంటే ఇతర పంటలు వేసుకోవచ్చు.

ప్రశ్న: వరి పంట సాగుకు ఏ రకమైన వైరెటీ సాగు చేసుకోవచ్చు? తెగుళ్లు సోకకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి?

– విష్ణువర్ధన్‌ రెడ్డి, గ్రా. మం. గుమ్మడిదల

శివ ప్రసాద్‌: వరిలో సన్నరకం సాగు చేసుకోవాలి. కొత్తగా వచ్చిన కేఎన్‌ఎం 16:38 రకం బాగుంటుంది. ఒక ఎకరాకు 32 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. వర్షాభావ పరిస్థితులను బట్టి తెగుళ్లు సోకే అవకాశం ఉంటుంది. అధికారుల సూచనలు మేరకు నివారణ చర్యలు చేపట్టాలి.

ప్రశ్న: పత్తి పంటలో దిగుబడి తగ్గకుండా ఎలాంటా చర్యలు తీసుకోవాలి? ఆయిల్‌ పామ్‌ పంటలో అంతర్‌ పంటలు సాగు చేసుకోవచ్చా? ఎలాంటి పంటలు వేసుకోవాలి?

– కిషన్‌, గ్రా.అంకెన్‌ పల్లి, మం.సదాశివపేట.

శివప్రసాద్‌: వర్షాలు అధికంగా కురవడంతో తెగుళ్లు సోకి పంట దిగుబడిపై ప్రభావం చూపుతుంది. పంట మార్పిడి చేయడంతో ప్రయోజనాలుంటాయి. పంట సాగులో సేంద్రీయ ఎరువులు వినియోగించాలి. పత్తి పంట సాగు చేసినప్పటికీ మేలు రకం విత్తనాలు వాడాలి. ఆయిల్‌పామ్‌ పంటలో అంతర పంటగా సోయాబీన్‌, పెసరతోపాటు ఇతర పంటలు సాగు చేసుకోవచ్చు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement