కొత్త కల్వర్టు నిర్మాణం | - | Sakshi
Sakshi News home page

కొత్త కల్వర్టు నిర్మాణం

Jun 10 2026 7:32 AM | Updated on Jun 10 2026 7:32 AM

జహీరాబాద్‌ టౌన్‌: ‘ప్రమాదకరంగా కల్వర్టు’శీర్షికన ఈ నెల 5న ‘సాక్షి’దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జహీరాబాద్‌ పట్టణంలోని తహసీల్దార్‌ రోడ్డులో దెబ్బతిన్న కల్వర్టుకు స్థానంలో కొత్త నిర్మాణానికి పనులు ప్రారంభించారు. నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్‌ నుంచి తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లే రోడ్డు మధ్యలో మురికి కాలువపై వేసిన కల్వర్టు స్లాబ్‌ ధ్వంసమై గుంతలు పడటంతో ప్రమాదకరంగా తయారైంది. ఇనుప కడ్డీలు పైకి తేలి వాహనాల టైర్లు దెబ్బతింటున్నాయి. దెబ్బతిన్న కల్వర్టు స్థానంలో కొత్తది నిర్మిస్తున్నారు.

మార్కెట్‌ ధర ప్రకారం

నిర్ణయించాలి

వ్య.కా.సం జిల్లా అధ్యక్షుడు రాంచందర్‌

జహీరాబాద్‌ టౌన్‌: వాస్తవ మార్కెట్‌ ధరలకు అనుగుణంగా భూముల విలువలను నిర్ణయించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బి.రాంచందర్‌ ప్రభుత్వాన్ని కోరారు. నిమ్జ్‌ పరిధిలోని రైతులతో మంగళవారం పట్టణంలోని శ్రామిక్‌ భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..నిమ్జ్‌ ప్రాజెక్టు పరిధిలోని భూములు ప్రస్తుతం ఎకరానికి రూ.60 నుంచి రూ.80 లక్షల వరకు మార్కెట్‌ ధర పలుకుతుందన్నారు. ప్రభుత్వం భూమి విలువ కేవలం రూ.4.50 లక్షలు నిర్ణయించడం వల్ల భూ బాధితులు నష్టపోతారన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలు, సూచనలను తీసుకున్న తర్వాతే భూముల విలువలను సవరించాలని కోరారు.

బుల్లెట్‌ రైల్‌ జహీరాబాద్‌ మీదుగా మళ్లించాలి

మాజీ ఎంపీ బీబీ పాటిల్‌కు కౌన్సిలర్‌ వినతి

జహీరాబాద్‌: హైదరాబాద్‌ నుంచి ముంబైకు మంజూరైన బుల్లెట్‌ రైల్‌ను జహీరాబాద్‌ మీదుగా మళ్లించాలని కోరుతూ జహీరాబాద్‌ మాజీ ఎంపీ బీబీ పాటిల్‌కు కౌన్సిలర్‌ వినతిపత్రం అందజేశారు. 27వ వార్డు మున్సిపల్‌ కౌన్సిలర్‌ నామ స్రవంతి మంగళవారం బీబీ పాటిల్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. జహీరాబాద్‌ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందని, నిమ్జ్‌ లాంటి భారీ ప్రాజెక్టులు ఇక్కడకు వస్తున్న నేపథ్యంలో మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో బీబీ పాటిల్‌ ఎంపీగా ఉన్న సమయంలో బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టులో జహీరాబాద్‌స్టేషన్‌ను చేర్చారని అయితే తాజా డీపీఆర్‌లో ఆ మార్గాన్ని వికారాబాద్‌ మీదుగా మళ్లించారని అది సరికాదని వివరించారు. ఈ సందర్భంగా బీబీ పాటిల్‌ స్పందిస్తూ కేంద్ర రైల్వేమంత్రిని, సంబంధిత ఉన్నతాధికారులను కలిసి డీపీఆర్‌లో తగిన మార్పులు చేయించి జహీరాబాద్‌ మీదుగా వెళ్లేలా కృషి చేస్తానని హామీనిచ్చారు.

ఆ కుటుంబానికి

న్యాయం చేయాలి

బీజేపీ నేత ప్రభుకుమార్‌గౌడ్‌

సంగారెడ్డి: నాలుగేళ్ల క్రితం చౌటకూర్‌ గ్రామ పరిధిలోని ఎంపీ డిస్టలరీ కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన దమ్మి కిష్టయ్య కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బీజేపీ నాయకులు పల్లె ప్రభుకుమార్‌గౌడ్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రమాదంలో మృతి చెందిన దమ్మి కిష్టయ్య కుటుంబానికి ఆ సమయంలో కంపెనీ యాజమాన్యం గ్రామ సర్పంచ్‌, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజల సమక్షంలో ఆయన కుమారుడు దమ్మి హేమంత్‌కు శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని హామీనిచ్చిందని తెలిపారు. అయితే నాలుగేళ్లు గడిచినా ఇప్పటివరకు ఆ హామీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement