తడ్కల్ కేంద్రం వద్ద రైతుల రాస్తారోకో
కంగ్టి(నారాయణఖేడ్): రైతులు ధర్నాలు చేస్తేనే జొన్నలు కొనుగోలు చేస్తారా అంటూ రైతులు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. కంగ్టి మండలంలోని తడ్కల్ గ్రామంలో జొన్నల కొనుగోలు కేంద్రం ఎదుట కంగ్టి, తడ్కల్ రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. దాదాపు గంట సేపు రాకపోకలు నిలిచిపోయాయి. ఇటీవల కురిసిన వర్షానికి జొన్నలు తడిసి మొలకెత్తుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఎస్సై దుర్గారెడ్డి సిబ్బందితో వచ్చి రైతులను సముదాయించడంతో శాంతించారు. అనంతరం మధ్యాహ్నం నాలుగు లారీలు పంపి జొన్నలు తరలించడానికి అధికారులు చర్యలు చేపట్టారు.


