పెట్రోల్ బాటిళ్లతో ఆత్మహత్యకు యత్నించిన రైతులు నచ్చజెప్పిన తహసీల్దార్ బుధవారం లోపు అన్‌లోడింగ్ చేస్తామని హామీ
కొల్చారం(నర్సాపూర్): ధాన్యాన్ని అన్‌లోడింగ్ చేయాలని రైతులు పెట్రోల్ బాటిళ్లతో ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన మంగళవారం మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... సంగాయిపేట గ్రామానికి చెందిన 8 మంది రైతులకు సంబంధించి 665 బస్తాల ధాన్యాన్ని మే 26న తూకం వేసి, కౌడిపల్లికి చెందిన శ్రీనివాస పారా బాయిల్డ్ రైస్‌మిల్ పేరుతో మండలంలోని వరిగుంతం శివారులోని గోదాంకు తరలించారు. ధాన్యం రంగు మారిందని సదరు రైస్ మిల్ యజమాని అన్‌లోడింగ్ చేసేందుకు నిరాకరించాడు. అక్కడి నుంచి రైతులు ధాన్యాన్ని నర్సాపూర్‌లోని మరో రైస్ మిల్లుకు తీసుకెళ్లారు. అక్కడ సైతం ధాన్యం అన్‌లోడింగ్ చేసుకోలేదు. తూకం వేసి అప్పటికే 15 రోజులు అవుతున్న అన్‌లోడింగ్ కాకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సోమవారం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ శ్రీనివాస్ చారి దృష్టికి తీసుకెళ్లి తమ గోడును విన్నవించినా అన్‌లోడింగ్ కానీ పరిస్థితి. దీంతో ఆగ్రహానికి గురైన రైతులు పెట్రోల్ బాటిళ్లను చేతబట్టుకొని తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రామానికి చెందిన ఎఫ్‌ఈఓ చైర్మన్ వెంకట్రామిరెడ్డి తహసీల్దార్‌కు, అటు రైతులకు నచ్చజెప్పారు. బుధవారం సాయంత్రంలోపు అన్‌లోడింగ్ చేయిస్తానని తహసీల్దార్ రైతులకు హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఓ రైతు ఆవేదన..
ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేయాలి. ధాన్యం తూకం పెట్టి రైస్ మిల్లుకు తరలించి 15 రోజులవుతుంది. ధాన్యం రంగు మారిందంటూ ఒక రైస్ మిల్ నుంచి మరో రైస్ మిల్లుకు తిప్పుతూ అన్‌లోడింగ్ చేయడం లేదు. డబ్బులు సకాలంలో రాకుంటే బిడ్డ పెళ్లి ఎలా చేసేది అంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే రెండు రోజులుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ, నెత్తి నోరు మొత్తుకున్న పట్టించుకోవడం లేదని వాపోయాడు.
ధాన్యం కాంటా వేయడం లేదని..
కొల్చారం(నర్సాపూర్): రోజులు గడుస్తున్నా ధాన్యం తూకం వేయడం లేదని రైతు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో మంగళవారం చోటు చేసుకుంది. పైతర గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రంగంపేట సహకార సంఘం ఏర్పాటు చేసింది. ధాన్యం సకాలంలో కాంటాలు వేయకపోవడం, తూకం వేసిన బస్తాలను తరలించేందుకు లారీలు రావడం లేదు. గ్రామానికి చెందిన రైతు ఎర్ర మోష నెల క్రితం ధాన్యం తీసుకొచ్చాడు. అప్పటి నుంచి తూకం వేయలేదు. మధ్యాహ్నం సహకార సంఘం ఆవరణలో మోష ధాన్యాన్ని తూకం వేస్తారా ? లేదా? అని సంఘం సిబ్బందిని నిలదీశాడు. అనంతరం పెట్రోల్ పోసుకున్నాడు. కార్యాలయంలో రైతులతో మాట్లాడుతున్న సంఘం చైర్మన్ రమేశ్ కుమార్ వెంటనే బయటకు వచ్చి మోషను వారించాడు. దీంతో అక్కడే ఉన్న పలువురు ఒంటిపై ఉన్న పెట్రోల్‌ను కడిగారు. సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు.


