దండిగా దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

దండిగా దరఖాస్తులు

Jun 10 2026 7:32 AM | Updated on Jun 10 2026 7:32 AM

● మొత్తం ఖాళీలు 120 ● వచ్చిన దరఖాస్తులు 176 ● జిల్లాలో 5 పాఠశాలలు

బెస్ట్‌ అవైలబుల్‌ పథకంపై పేద విద్యార్థుల ఆసక్తి
● మొత్తం ఖాళీలు 120 ● వచ్చిన దరఖాస్తులు 176 ● జిల్లాలో 5 పాఠశాలలు

మెదక్‌ కలెక్టరేట్‌: నిరుపేద విద్యార్థుల నుంచి బెస్ట్‌ అవైలబుల్‌ పథకానికి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన వారికి ఈ పథకం కింద కార్పొరేట్‌ పాఠశాలల్లో చదువుకునే అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే జిల్లాలో ప్రస్తుతం 474 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రతి యేడాది ఖాళీ అయిన సీట్లను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ ద్వారా ఆన్‌లైన్‌ దరఖాస్తులను స్వీకరిస్తుంది. కలెక్టర్‌ ఆధ్వర్యంలో లక్కీ డ్రా తీసి విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపికై న విద్యార్థులు 10వ తరగతి వరకు ఉచితంగా చదువుకొనే అవకాశం ఉంటుంది.

జిల్లాలో 5 పాఠశాలలు

జిల్లాలో బెస్ట్‌ అవైలబుల్‌ పథకంలో 5 పాఠశాలలు ఉన్నాయి. మెదక్‌లో సిద్ధార్థ్‌ విద్యాసంస్థలు, గీతా హైస్కూల్‌, రామాయంపేటలో మంజీరా విద్యాసంస్థలు, వివేకానంద ఆవాస విద్యాలయం, తూప్రాన్‌న్‌లో గీతా స్కూల్‌ ఉంది. ప్రస్తుతం ఈ పాఠశాలల్లో పథకం కింద 474 మంది విద్యార్థులు చదువుతున్నారు.

రూ.1.05 కోట్లు చెల్లింపు

బెస్ట్‌ అవైలబుల్‌ పథకం కింద విద్యార్థులకు విద్యనందిస్తున్న ప్రైవేట్‌ విద్యా సంస్థలకు ప్రభుత్వం ప్రతి ఏడాది ట్యూషన్‌ ఫీజు చెల్లిస్తుంది. జిల్లాలో మూడేళ్లుగా ట్యూషన్‌ ఫీజు మొత్తం రూ.1.70 కోట్లు పెండింగ్‌లో ఉంది. దీంతో గత ఏడాది విద్యార్థులను పాఠశాలల్లో చేర్చుకోబోమని తేల్చి చెప్పారు. దీంతో స్పందించిన అప్పటి కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, డీఈఓ, షెడ్యూల్డ్‌ కులాల అధికారి విద్యాసంస్థలతో మాట్లాడి సర్ది చెప్పారు. ప్రభుత్వం గత ఏడాది రూ.1.05 కోట్లు మంజూరు చేయడంతో వారికి అందజేశారు. ఇంకా 40 శాతం అంటే రూ.65లక్షలు చెల్లించాల్సి ఉంది.

దరఖాస్తుల వెల్లువ

జిల్లాలో ఖాళీగా ఉన్న 120 సీట్ల భర్తీకి ప్రభుత్వం మే 15న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈనెల 8 వరకు 176 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1వ తరగతిలో 59 సీట్లు ఖాళీగా ఉండగా 83 దరఖాస్తులు, 5వ తరగతిలో 61 సీట్లు ఖాళీగా ఉండగా 93 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి అధికారులు, తల్లిదండ్రుల సమక్షంలో కలెక్టరేట్‌లో లక్కీ డ్రా తీసి విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ ఏడాది ఎస్సీ వర్గీకరణ నూతన రిజర్వేషన్‌ ప్రకారం ఎంపిక చేయనున్నట్లు తెలిసింది.

విద్యాసంస్థలతో చర్చించాం

ఈ ఏడాది బెస్ట్‌ అవైలబుల్‌ కింద విద్యార్థులను చేర్పించేందుకు ఇప్పటికే జిల్లాలోని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలతో చర్చించాం. పెండింగ్‌ బిల్లుల గురించి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయొద్దని, బిల్లులు రాగానే చెల్లిస్తామని యజమాన్యాలకు కలెక్టర్‌ సూచించారు. వారు కూడా ఇందుకు సమ్మతించారు. విద్యార్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ పూర్తయి పరిశీలన జరుగుతుంది. త్వరలోనే కలెక్టర్‌ ఆధ్వర్యంలో లక్కీ డ్రా ద్వారా విద్యార్థుల ఎంపిక చేస్తారు.

– సింధూ, జిల్లా షెడ్యూల్డు కులాల

అభివృద్ధి అధికారి, మెదక్‌.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement