పెద్దశంకరంపేట(మెదక్): మండల ప్రభుత్వ ఉపాధ్యాయుడు, రచయిత బృంగి ప్రసన్నకుమార్ రచించిన మాస్టర్ యువర్ మైండ్ పుస్తకాన్ని కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆవిష్కరించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో పుస్తకాన్ని ఆవిష్కరించి అనంతరం ఆమె మాట్లాడారు. మనిషి ప్రవర్తనలో ప్రత్యేకతలను సరిగ్గా విశ్లేషి ంచడం కష్టమైన పని అన్నారు. పరీక్షలను ఎదుర్కొనే విద్యార్థులు, జీవన, వైవాహిక స్థిరత్వా న్ని ఎదుర్కొనే యువతకు, కుటుంబం గురించి ఆలోచించి ఆందోళన పడే పెద్దలకు ఈ పుస్తకం మార్గదర్శిగా ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా రచయిత ప్రసన్నకుమార్‌ను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో డీఈఓ రాజు, ఏఎంఓ సుదర్శన మూర్తి, రాజు, ఎస్‌ఓ నవీన్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
టిప్పర్ స్వాధీనం
చేర్యాల(సిద్దిపేట): ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్‌ను మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ జి.అపూర్వరెడ్డి వివరాల ప్రకారం.. పట్టణ శివారు అకునూరు రోడ్డులోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో కొందరు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్నట్లు సమాచారం వచ్చింది. ఈ మేరకు సిబ్బంది అక్కడకు వెళ్లి చూడగా మట్టిని తరలించేందుకు సిద్ధంగా ఉన్న టిప్పర్‌ను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.
వృద్ధుడు అదృశ్యం
చిన్నశంకరంపేట(మెదక్): వృద్ధుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన నార్సింగి మండలంలోని చోటు చేసుకుంది. నార్సింగి ఎస్‌ఐ సృజన కథనం ప్రకారం... సంకాపూర్ దర్గాతండాకు చెందిన పాల్త్యా లింబ్యా(60) పదిహేను రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో బంధువుల వద్ద, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. వృద్ధుడి భార్య కమల ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.
పేకాటరాయుళ్ల అరెస్టు
కొల్చారం(నర్సాపూర్): పేకాట ఆడుతున్న వారిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మంగళవారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ హైమద్ మోహినొద్దీన్ వివరాల ప్రకారం... మండలంలోని ఎనగండ్ల గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు పట్టుపడ్డారు. వారి వద్ద నుంచి రూ.15,100 నగదు,7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేశారు.
గుర్తుతెలియని వ్యక్తి
శవం లభ్యం
కంది(సంగారెడ్డి): గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైంది. ఈ సంఘటన మండల కేంద్రం కంది శివారులో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి కథనం ప్రకారం.. కంది సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జి కింద వ్యక్తి శవం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు శవాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే మృతుని వివరాలు తెలియలేదని, శవం పూర్తిగా కుళ్లిన స్థితిలో ఉండడంతో రెండు మూడు రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


