జహీరాబాద్ టౌన్: రాజీపడదగిన కేసులను గుర్తించి ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ద్వారా అవగాహన కల్పించాలని సీనియర్ సివిల్ జడ్జి, లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జి.కవితా దేవి సూచించారు. ఈ నెల 20న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను పురస్కరించుకొని పోలీసు అధికారులు, న్యాయవాదులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లోక్‌అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందన్నారు. రాజీ పడదగిన కేసులను ముందుగా గుర్తించి ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని, లోక్ అదాలత్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలన్నారు. చిన్న చిన్న కేసులతో కక్ష పెంచుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బులను వృథా చేసుకోవద్దని కక్షిదారులకు చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి ఎండీ అబ్దుల్ ఖలీల్, డీఎస్పీ సైదానాయక్, జహీరాబాద్ రూరల్ సీఐ.హన్మంత్, ఎస్‌ఐలు లవకుమార్, కాశీనాథ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఏజీపీ దత్తాత్రేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


