డీఎస్పీ సైదానాయక్
జహీరాబాద్: మహిళలు ఆర్థికంగా ఎదిగి తమ కాళ్లపై తాము నిలబడాలని డీఎస్పీ సైదానాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ శిరీషారెడ్డి అన్నారు. మంగళవారం జహీరాబాద్ పట్టణంలోని ఎస్‌వీ ఫంక్షన్‌హాలులో వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో కోల్ ఇండియా కంపెనీ ఆర్థిక సహాయంతో జహీరాబాద్, న్యాల్‌కల్ మండలాలకు చెందిన 120 మంది మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... ప్రభుత్వరంగ సంస్థ అయిన కోల్ ఇండియా సహాయంతో అందజేసిన కుట్టుమిషన్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంటి వద్దే ఉండి బట్టలు కుట్టి ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నారు. గత ఏడాది నిర్వహించిన మొదటి విడతలో 800 మందికి ఉచిత శిక్షణనిచ్చి, ఉచితంగా కుట్టుమిషన్లు అందజేశారని తెలిపారు. ఈ ఏడాది 700 మందికి ఉచితంగా శిక్షణ ఇప్పించడంతో పాటు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జి.శుక్లవర్ధన్‌రెడ్డి, కో–ఆర్డినేటర్ సురేందర్‌రెడ్డి, అసిస్టెంట్ కో–ఆర్డినేటర్ రాంచంద్రారెడ్డి, సామాజిక కార్యకర్త విజయలక్ష్మి పాల్గొన్నారు.


