కొల్చారం(నర్సాపూర్): పాము కాటుతో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని ఏటిగడ్డ మాందాపూర్‌లో మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ హైమద్ మోహినొద్దీన్ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన ఎలకుర్తి మల్లేశం(39) తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. సోమవారం రాత్రి భార్యాపిల్లలతో కలిసి భోజనం చేసి నిద్రపోయాడు. అర్ధరాత్రి కుడి చేయి ఉంగరం వేలుకు పాము కాటు వేసింది. దీంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మల్లేశంను మొదట జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి, పరిస్థితి విషమంగా మారడంతో సంగారెడ్డికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతునికి భార్య లక్ష్మితో పాటు కుమారుడు, కూతురు ఉన్నారు.
అన్నదాన సత్రం అద్ధం
మీదపడి యాచకురాలు..
చేగుంట(తూప్రాన్): ప్రమాదవశాత్తు అద్దం మీదపడి తీవ్ర గాయాలై యాచకురాలు మృతి చెందింది. ఈ సంఘటన కర్నాల్‌పల్లి సాయిబాబా ఆలయ సమీపంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... చిన్నశంకరంపేట మండలం అంబాజీపేటకు చెందిన కళవ్వ(70) భిక్షాటన చేస్తూ జీవిస్తుంది. ఈ క్రమంలో కర్నాల్‌పల్లి సాయిబాబా ఆలయ సమీపంలోని అన్నదాన సత్రం అద్దం పగిలి పైఅంతస్తు నుంచి సేద తీరుతున్న కళవ్వపై పడింది. దీంతో ఆమె మెడ, చేతి భాగం తెగి తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు.


