వైస్ ప్రిన్సిపాల్ అయోధ్యరెడ్డి
సిద్దిపేటఎడ్యుకేషన్: ఉపాధి శిక్షణతో కూడిన డిగ్రీ కోర్సులు(ఏఈడీపీ)తో విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్యరెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ కో ఎడ్యుకేషన్ జూనియర్ కళాశాలలో మంగళవారం ఏఈడీపీ నూతన కోర్సులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన కరపత్రాలను జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ దేవయ్యతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం అయోధ్యరెడ్డి మాట్లాడుతూ... ఏఈడీపీలో భాగంగా బీఎస్సీ ఫిషరీస్ అండ్ ఆక్వా కల్చర్ కోర్సును అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఈ కోర్సుతో విద్యార్థులు సాధారణ డిగ్రీతో పాటు చేపల పెంపకం, ఆక్వా కల్చర్ నిర్వహణ, చెరువుల అభివృద్ధి, చేపల ఉత్పత్తి సాంకేతికతలు వంటి అంశాల్లో ప్రయోగాత్మక శిక్షణ పొందుతారన్నారు. ఇంటర్మీడియెట్‌లో బైపీసీ, లేదా ఎంఎల్‌టీ ఒకేషన్ కోర్సును బ్రిడ్జి కోర్సుతో పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరేందుకు అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో జువాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు విశ్వనాథం, మధుసూదన్‌రెడ్డి, అధ్యాపకుడు వైకుంఠం, జూనియర్ కళాశాల అధ్యాపకులు శ్రీనివాస్, కనకచంద్రం, వేంకటరమణ, రఘురాజ్, గంగాధర్, నరేందర్‌రెడ్డి, కొమురయ్య పాల్గొన్నారు.


