వీధి కుక్కల వీర విహారం
సంగారెడ్డి జోన్: జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట కుక్కలు దాడులకు పాల్పడుతున్నాయి. పట్టణాలు, గ్రామాలు తేడా లేకుండా ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వీధుల్లో గుంపులుగా సంచరిస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా దాడులకు పాల్పడుతున్నాయి. అంతేకాకుండా రహదారులపై ప్రయాణిస్తున్న వాహనదారులను వెంబడిస్తూ గాయాలపాలు చేస్తున్నాయి. ఎక్కడినుంచి వచ్చి ఎవరిపై దాడి చేస్తాయో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. వీధి కుక్కల స్వైర విహారం ప్రజల ప్రాణాలకు ప్రాణాంతకంగా మారాయి.
ప్రజల్లో భయాందోళన
మనుషులపై కుక్కలు క్రూరంగా దాడులకు పాల్పడుతున్నాయి. తీవ్రస్థాయిలో దాడులకు పాల్పడడంతో ఆస్పత్రుల పాలవుతున్నారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా రాత్రి తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. ఒంటరిగా చిన్నపిల్లల్ని బయటికి పంపించేందుకు జంకుతున్నారు.
జిల్లాలో 13,486 శునకాలు
20వ పశుగణన ప్రకారం జిల్లా వ్యాప్తంగా 13,486 కుక్కలు ఉన్నాయి. ప్రస్తుతం వీటి సంఖ్య 20 వేలకు పైగా చేరినట్లు సమాచారం. జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి, అందోల్‌లోని పలు మండలాల్లో ఎక్కువగా ఉన్నాయి. గ్రామాలు, పట్టణాల్లోని రహదారుల పక్కనే మాంసపు వ్యర్థాలతో పాటు ఇతర వ్యర్థాలను యథేచ్ఛగా పారవేస్తున్నారు. దీంతో ఆయా ప్రదేశాల్లో వాటిని తిని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాయి. అటుగా వెళ్లే వారిపై కరువడంతో గాయాలతోపాటు మృత్యువాత పడిన సందర్భాలు సైతం ఉన్నాయి.
నియంత్రణలో విఫలం..
కుక్కల పెరుగుదలను నియంత్రించడంలో అధికారులు విఫలమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఏనిమల్ బర్త్ కంట్రోల్ చేసేందుకు ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించి, కాశీపూర్ గ్రామంలో నియంత్రణ కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఏజెన్సీ నిర్వాహకులు కుక్కలను నియంత్రణ కేంద్రాలకు తీసుకువెళ్లి కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేసి, రేబిస్ టీకా వేసి ఎక్కడి నుంచి తీసుకువచ్చారో అక్కడే వదిలివేయాల్సి ఉంటుంది. కానీ మున్సిపల్, గ్రామపంచాయతీ అధికారుల నిర్లక్ష్యంతో ఆ కార్యాచరణ కాస్తా ముందుకు సాగటం లేదు. ఫలితంగా వీటి బెడద రోజురోజుకూ అధికమవుతుంది.
పట్టించుకోని అధికారులు
జిల్లా వ్యాప్తంగా రోజురోజుకూ కుక్క కాటు కేసులు పెరుగుతున్నాయి. తీవ్ర స్థాయిలో గాయాలు చేస్తున్నప్పటికీ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నియంత్రణ చర్యలు చేపడుతున్నామని చెబుతున్నా.. లెక్కలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకొని కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
జిల్లాలో కొన్ని ఘటనలు..
ఈనెల 6న కొండాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో వీధి కుక్కలు సంచరిస్తూ చిన్నారులతోపాటు మహిళలపై దాడి చేశాయి. కాలు, చేతికి గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందారు.
ఈనెల 7న ఝరాసంగం మండలంలోని పూరి నాయక్ తండాకు చెందిన విశాల్‌ను పిచ్చికుక్క దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. అదే రోజు తుమ్మన్‌పల్లి గ్రామానికి చెందిన ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న సమయంలో ముక్కుకు కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి.
తాజాగా ఆదివారం తుమ్మనపల్లి గ్రామానికి చెందిన ముగ్గురిపై పిచ్చికుక్క దాడి చేయడంతో పెదవులు, చెంపలపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.
గాయాల పాలవుతున్న
చిన్నారులు, వృద్ధులు
వాహనదారులను
వెంబడిస్తున్న శునకాలు
భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు
నియంత్రణలో అధికారులు విఫలం


