ది స్కౌట్–గైడ్స్ ఆర్గనైజేషన్
జిల్లా కమిషనర్ రూయల్ రాజ్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాలోని మండలాల వారీగా స్కౌట్ మాస్టర్ల ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సిద్దిపేట్ జిల్లా కమిషనర్ ఇస్సారపు రూయల్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. స్కౌట్ మాస్టర్‌లకు నెలసరి వేతనం రూ.15వేలు ఉంటుందన్నారు. డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు కల్గిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ నెల 10న సాయంత్రం 5గంటల వరకు స్వీకరించనున్నారు. వివరాలకు జిల్లా కార్యాలయం ఫోన్ నెం. 77949 30047లో సంప్రదించాలని సూచించారు.
సైక్లింగ్‌తో శారీరక దృఢత్వం
జిల్లా క్రీడల శాఖ అధికారి వీరారెడ్డి
సిద్దిపేటజోన్: పర్యావరణ హితంగా సైక్లింగ్ సాధన చేయాలని, విద్యార్థులు సైక్లింగ్‌పై ఆసక్తి చూపాలని జిల్లా క్రీడల శాఖ అధికారి వీరారెడ్డి సూచించారు. ఆదివారం స్టేడియంలో ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా క్రీడల శాఖ ఆధ్వర్యంలో సైక్లింగ్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని డీఎస్‌వైఓ జెండా ఊపి ప్రారంభించారు. సైక్లింగ్ వల్ల ఆరోగ్యంతోపాటు శారీరక దృఢత్వం చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, ఖేల్ ఇండియా సైక్లింగ్ కోచ్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
చేపలు పట్టడానికి వెళ్లి
వృద్ధుడు మృతి
దుబ్బాకటౌన్: చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన దుబ్బాక పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. దుబ్బాక ఎస్సై కీర్తి రాజు వివరాల ప్రకారం... దుబ్బాక పట్టణానికి చెందిన పర్వతం మల్లయ్య(70) నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి కనిపించకుండా వెళ్లిపోయాడు. గతంలో సైతం మద్యం మత్తులో పలుమార్లు ఇంటి నుంచి వెళ్లి తిరిగి వచ్చాడు. కానీ ఈ సారి మద్యం మత్తులో చేపలు పట్టడానికి బోడినికుంటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. దుర్వాసన వస్తుండడంతో గేదెల కాపరి గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా మల్లయ్యగా నిర్ధారించారు. మల్లయ్య కుమారుడు ప్రశాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
వృద్ధురాలు అదృశ్యం
సంగారెడ్డి క్రైమ్: వృద్ధురాలు అదృశ్యమైంది. ఈ ఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పట్టణ సీఐ రామునాయుడు వివరాల ప్రకారం... పట్టణంలోని హనుమాన్ నగర్ (కింది బజార్)కు చెందిన బుక్క పెంటమ్మ(58) గృహిణి. తన కుమారుడు కుటుంబంతో కలిసి కొన్ని నెలలుగా సంగారెడ్డిలో జీవిస్తుంది. మతిస్థిమితం సరిగాలేని పెంటమ్మ ఈ నెల 6న అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల తెలిసిన వారు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మట్టి తవ్వకాలపై
కేసు నమోదు
శివ్వంపేట(నర్సాపూర్): అక్రమ మట్టి తవ్వకాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై మధుకర్‌రెడ్డి వివరాల ప్రకారం... మండల పరిధిలోని దొంతి కుందలమ్మ చెరువులో నుంచి రాత్రి వేళల్లో జేసీబీతో మట్టి తవ్వకాలు చేస్తూ ట్రాక్టర్ల ద్వారా తరలిస్తుండగా వాటిని స్వాధీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా మట్టి తవ్వకాలు జరిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.


