మునిపల్లి(అందోల్): మార్క్‌ఫెడ్‌లో రైతులు జొన్నలను అమ్ముకోవాలని మాజీ ఎంపీపీ రాంరెడ్డి రైతులను కోరారు. ఆదివారం మండలంలోని బుదేరా రైతు వేదికలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఎకరాకు 10 క్వింటాళ్ల జొన్నలను మార్క్ ఫెడ్‌లో తీసుకోనున్నట్లు తెలిపారు. క్వింటాళ్ల జొన్నలను ధర రూ.3,669ల చొప్పున ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లేశం, రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ కుమార్, కంకోల్ నాగేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా తిరు కల్యాణం
రామచంద్రాపురం(పటాన్‌చెరు): స్థానిక డివిజన్ పరిధిలోని కాకతీయనగర్ కాలనీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో తిరుకల్యాణ మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వామి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు ఆంజయ్య, పుష్ప, నాయకులు ఐలేష్, పరమేష్ పాల్గొన్నారు.
నూతన బోరు ప్రారంభం
నారాయణఖేడ్: స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని మంగల్‌పేట్ 3వ వార్డులో కౌన్సిలర్ స్వప్న తనను ఎన్నికల్లో గెలిపిస్తే బోరువేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు విజయం సాధించడంతో ఇచ్చిన హామీమేరకు వార్డులో బోరును ప్రారంభించారు. ఈ మేరకు ఆదివారం మోటా రు బిగించి పూజ చేసి వార్డు పెద్దలు, కాలనీవాసులతో కలిసి బోరును ప్రారంభించారు. దీంతో కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.
భగవద్గీత గ్రంథాల పంపిణీ
జిన్నారం (పటాన్‌చెరు): గడ్డపోతారం పట్టణ పరిధిలోని వాబిలాలలో ఆదివారం నగరానికి చెందిన త్రైత సిద్ధాంత ప్రబోధా సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గ్రామస్తులకు భగవద్గీత గ్రంథాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షుడు సీహెచ్ గిరి ఇంటింటికి వెళ్లి త్రైత సిద్ధాంత జ్ఞాన గ్రంథాలపై ప్రచారం చేశారు. దైవ జ్ఞానం ప్రకారం కులాలు, మతాలు నిషిద్ధమని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. భగవద్గీతలోని సారాన్ని కర్మయోగంగా భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు కుమార్, నరసింహాచారి, శ్రీనివాస్, నరసింహారావు ప్రదం అశోక్, అంజి, వీరన్న, చంద్రకళ, నాగమణి, లక్ష్మీ, పద్మ, స్వప్న పాల్గొన్నారు.
కార్యదర్శికి సన్మానం
రామాయంపేట(మెదక్): గ్రామాభివృద్ధిలో ప్రగతి ధర్మారం కార్యదర్శి మహేందర్ ఎనలేని కృషి చేసి అందరి మన్ననలు పొందారు. ఇటీవల ఆయన బదిలీ కాగా ఆదివారం ఆయనను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈమేరకు పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులతోపాటు గ్రామస్తులు పాల్గొన్నారు.


