అందమైన అడవోయి.. ఆహ్లాదం అందెనోయి | - | Sakshi
Sakshi News home page

అందమైన అడవోయి.. ఆహ్లాదం అందెనోయి

Jun 7 2026 9:30 AM | Updated on Jun 7 2026 9:30 AM

● రూ.4 కోట్లతో అభివృద్ధి పనులకు మంజూరు ● త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు

208 ఎకరాల్లో అర్బన్‌ పార్కు నిర్మాణం
● రూ.4 కోట్లతో అభివృద్ధి పనులకు మంజూరు ● త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు

జహీరాబాద్‌: జహీరాబాద్‌ ప్రాంత ప్రజలు ఆహ్లాదం పొందేందుకుగాను అర్బన్‌ పార్క్‌ సిద్ధమైంది. దీంతో పర్యాటకులు ప్రకృతి ఒడిలో సేదతీరనున్నారు. ఈ పార్కు మున్సిపాలిటీ వాసులతోపాటు పరిసర గ్రామాల ప్రజలకు ఆహ్లాదాన్ని పంచనుంది. త్వరలో మంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఫారెస్టు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 65వ జాతీయ రహదారి పక్కనే 208 ఎకరాల భారీ విస్తీర్ణంలో పార్కును సుందరంగా తీర్చిదిద్దేందుకు నిర్ణయించారు.

ఆరేళ్లకు మోక్షం

జహీరాబాద్‌ పట్టణ శివారులో 65వ జాతీయ రహదారి పక్కన గల మహీంద్ర కర్మాగారం సమీపంలో ఉన్న రిజర్వు ఫారెస్టు భూమిలో ఎకోపార్కు (అర్బన్‌ పార్కు) రూపొందించేందుకు ఆరేళ్ల క్రితం రూ.4 కోట్లను మంజూరు చేసింది. అయితే నిధుల విడుదలలో జాప్యం జరుగుతూ వచ్చింది. అభివృద్ధి పనులు చేపట్టేందుకుగాను రూ.2కోట్ల నిధులను విడుదల చేసింది. 208 ఎకరాల భారీ విస్తీర్ణంలో లంగ్‌ స్పేస్‌(పచ్చని ఊపిరితిత్తులు)గా మార్చాలని సంకల్పించారు. నిధులు సరిపోని కారణంగా పనుల్లో స్తబ్దత ఏర్పడటంతో అటవీశాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడంతో పనుల్లో కదలిక వచ్చింది. కాంపన్సేటరీ అఫ్పారెష్ట్రేషన్‌ (సీఏఎంపీఏ) నిధుల నుంచి రూ.55 లక్షలు కేటాయించడంతో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యాయి.

ప్రజలకు హెల్త్‌ హబ్‌గా...

ప్రజలకు ఆహ్లాదం పొందేందుకు వీలుగా రూపుదిద్దుకున్న అర్బన్‌ పార్కు హెల్త్‌ హబ్‌గా మారనుంది. ఉదయం పూట వాకింగ్‌ చేసే వారి కోసం ప్రశాంతమైన నడకదారులు, మానసిక ప్రశాంతత కోసం ప్రత్యేకంగా యోగా కేంద్రం, పిల్లలు ఉత్సాహం–ఉల్లాసంగా గడిపేందుకు ప్లే ఏరియాలను రూపొందించారు. పర్యావరణ ప్రాముఖ్యత గురించి తెలుసుకునేందుకు వీలుగా ప్రత్యేక ప్రదర్శనలు, సైన్‌ బోర్డులను ఏర్పాటు చేశారు.

పార్కులో చేపట్టిన నిర్మాణాలు..

అర్బన్‌ పార్కు సందర్శనకు వచ్చే వారికి పలు సౌకర్యాలను కల్పించారు. రూ.22 లక్షలతో వాకింగ్‌ ట్రాక్‌ నిర్మించారు. రూ.15లక్షలతో వాచ్‌ టవర్‌, రూ.90 లక్షలతో మూడు కిలోమీటర్ల ఇనుప కంచె నిర్మాణం, రూ.6.70 లక్షలతో ప్రధాన ముఖద్వారం, వాచ్‌మెన్‌ గది, రూ.9.24లక్షలతో మోగా షెడ్డు, రూ.3.50 లక్షలతో సోలార్‌ బోరు, రూ.14 లక్షలతో పిల్లల ఆటస్థలం, రూ.2లక్షలతో నాలుగు రచ్చబండల ప్లాట్‌ఫాంలను ఏర్పాటు చేశారు.

అందాలను ఆస్వాదించేలా..

రిజర్వు ఫారెస్టులోని అందాలను ఆస్వాదించేందుకు వీలుగా అర్బన్‌ పార్కును తీర్చిదిద్దాము. ఇది జహీరాబాద్‌ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసేందుకు వీలుగా కృషి చేస్తాం. ఉన్న నిధులతో సౌకర్యాలను కల్పించాం. అందుబాటులోకి తెచ్చేందుకు అంతా సిద్ధం చేశాం.

–శ్యాంసుందర్‌,

ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌–జహీరాబాద్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement