రేపు నిజాంపేటలో చేపప్రసాదం పంపిణీ | - | Sakshi
Sakshi News home page

రేపు నిజాంపేటలో చేపప్రసాదం పంపిణీ

Jun 7 2026 9:30 AM | Updated on Jun 7 2026 9:30 AM

నారాయణఖేడ్‌: ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు మృగశిర కార్తె పురస్కరించుకుని నిజాంపేట్‌ మండల కేంద్రంలో ఈనెల 8న ఉదయం 7.30 గంటల నుంచి సాయంత్రం వరకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు లింగాగౌడ్‌, పర్వాగౌడ్‌, నాగరాజుగౌడ్‌, శంకర్‌గౌడ్‌, వెంకటేశ్‌గౌడ్‌, సాయిబాబాగౌడ్‌ పేర్కొన్నారు. గత 81 ఏళ్లుగా తమ కుటుంబం ఆధ్వర్యంలో చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ వస్తున్నామన్నారు. ఏటా ప్రసాదం కోసం తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి సైతం పెద్దసంఖ్యలో వ్యాధిగ్రస్తులు వస్తుంటారు.

గ్రామాభివృద్ధిలో

భాగస్వాములు కావాలి

ఝరాసంగం(జహీరాబాద్‌): గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా పరిషత్‌ సీఈవో జానకీరెడ్డి, జిల్లా సంక్షేమాధికారి లలితకుమారి పిలుపునిచ్చారు. మండల పరిధిలోని చిలకపల్లిలో శనివారం నిర్వహించిన గ్రామసభలో వారు పాల్గొని మాట్లాడారు. గ్రామంలో ప్రతీ ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను ఇష్టానుసారంగా పారేయరాదని సూచించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు సహకరించాలన్నారు. వ్యవసాయ అధికారుల సూచనలు మేరకు పంటలు సాగు చేయాలని సూచించారు. సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేయడం ద్వారా ఆరోగ్యంతోపాటు ఆదాయం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో మంజుల, తహసీల్దార్‌ భాస్కర్‌, గ్రామ సర్పంచ్‌ దిలీప్‌ తదితరులు పాల్గొన్నారు.

ఖేడ్‌ను ఐటీడీఏగా గుర్తించాలి

నారాయణఖేడ్‌: జిల్లాలోకెల్ల అత్యధిక గిరిజన జనాభా ఉండి అన్ని రంగాల్లోనూ వెనుకబడిన ప్రాంతమైన ఖేడ్‌ను ఐటీడీఏగా గుర్తించాలని ఉపసర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రాథోడ్‌ సురేశ్‌సింగ్‌ డిమాండ్‌ చేశారు. ఖేడ్‌ నియోజకవర్గంలోని పలు గిరిజన తండాల్లో శనివారం గిరిజనులతో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ..ఉపాధి కరువై ఇక్కడి గిరిజనులు పొట్ట చేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారన్నారు. ఐటీడీఏగా ఏర్పాటుచేసి ఇక్కడి గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రభుత్వాన్ని కోరారు. పలువురు ఫోరం బాధ్యులు పాల్గొన్నారు.

డాక్టర్‌ పుట్టరాజుకు

ఫ్రెండ్‌ ఆఫ్‌ కర్ణాటక అవార్డు

రామచంద్రాపురం(పటాన్‌చెరు): బీహెచ్‌ఈఎల్‌ జనరల్‌ ఆస్పత్రి డిప్యూటీ చీఫ్‌ మెడికల్‌ అధికారి డాక్టర్‌ ఆర్‌.పుట్టరాజుకు ఫ్రెండ్‌ ఆఫ్‌ కర్ణాటక అవార్డు లభించింది. బెంగళూరులో శుక్రవారం కళాగ్రామంలో కన్నడ సామాజిక, సాంస్కృతిక శాఖ సహకారంతో కన్నడ మీడియా క్లబ్‌ నిర్వహించిన కార్యక్రమంలో నటుడు చేతన్‌అహింస చేతుల మీదగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా శనివారం భెల్‌ కాలనీలో ఆయనను పలువురు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో పుట్టరాజు మాట్లాడుతూ..అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు.

మద్యం అమ్మకాలపై నిషేధం

చేగుంట(తూప్రాన్‌): మద్య నిషేధంపై మండలంలోని బీ.కొండాపూర్‌ గ్రామ సభలో తీర్మానం చేశారు. మండలంలోని ఆరు గ్రామా ల్లో శనివారం ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించగా, బీ.కొండాపూర్‌లో సర్పంచ్‌ రాజిరెడ్డి ఆధ్యర్యంలో మద్య నిషేధంపై తీర్మానం చేసి ప్రతిజ్ఞ చేశారు. అలాగే వడియారంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్‌ పాల్గొని ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని, ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement