ఎస్పీ పరితోశ్ పంకజ్
కొండాపూర్(సంగారెడ్డి): సైబర్ నేరగాళ్లు వేసే వలలో ప్రజలు మోసపోకుండా జాగ్రత్తలు వహించాలని ఎస్పీ పరితోశ్ పంకజ్ సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం మండల పరిధిలోని గొల్లపల్లి లో నిర్వహించిన గ్రామసభలో జిల్లా ఎస్పీ పాల్గొని మాట్లాడారు. సైబర్ మోసగాళ్లు మొదట కొంత డబ్బు వచ్చినట్లు చూపించి, అనంతరం భారీ మొత్తాలు పెట్టుబడి పెట్టేలా ప్రలోభపెట్టి మోసా లకు పాల్పడుతున్నారని వారిపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఆన్‌లైన్‌్‌లో అపరిచితులతో పరిచయాలకు దూరంగా ఉండాలని, తెలియ ని లింకులు లేదా ఏపీకే ఫైళ్లను ఓపెన్ చేసి మోసపోవద్దన్నారు. సైబర్ నేరాల బారిన పడుతున్న వారిలో విద్యావంతులే అధికంగా ఉన్నారని, వీటిపై అవగాహన పెంచుకుని గ్రామస్థాయిలో ప్రజలకు చైతన్యం కల్పించాలని కోరారు. మహిళలపై జరుగుతున్న వివిధరకాల నేరాలు, పోక్సో, అత్యాచార కేసుల్లో భరోసా కేంద్రం పనితీరు, మహిళల రక్షణ కోసం షీ–టీమ్స్ అందిస్తున్న సేవలు, సైబర్ నేరాల నివారణ చర్యలు, అత్యవసర సేవల వినియోగం తదితర అంశాలపై ప్రజలకు వివరించారు. అనంతరం గొల్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు.
పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలి
సంగారెడ్డి జోన్: విద్యార్థులు పోటీ పరీక్షలకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని ఎస్పీ పరితోశ్‌పంకజ్ సూచించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో స్పార్క్ కార్యక్రమంలో పోలీసు అధికారులు, వారి పిల్లలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...ప్రతీ ఒక్కరు కృషి, పట్టుదలతో ఉన్నతలక్ష్యాలను అధిరోహించాలన్నారు. మొదటి ప్రయత్నంలో విఫలమైనా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని సూచించారు. ఉన్నత ఉద్యోగాల సాధనకు కృషి, పట్టుదలతో విద్యను అభ్యసించి ఉన్నత పదవులను సాధించిన డిప్యూటీ కలెక్టర్ మురళి మాధినేని, ట్రైనీ డీఎస్పీ సుజాత, ఎంబీబీఎస్ వైద్యురాలిగా విధులు నిర్వహిస్తూ ఐఆర్‌ఎస్ సాధించిన ప్రత్యూష తమ విజయాల తీరును వివరించారు.


