కలెక్టర్ ప్రతీక్‌జైన్
జహీరాబాద్ టౌన్: చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తుల విక్రయ కేంద్రం (రిటైల్ యూనిట్)సంగారెడ్డిలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తే పూర్తి సహాయ సహకారాలను అందిస్తానని కలెక్టర్ ప్రతీక్‌జైన్ హామీనిచ్చారు. డీడీఎస్ మహిళా రైతులు సేంద్రియ ఎరువులతో సిరిధాన్యాలు పండించడం అభినందనీయమన్నారు. యూఎన్‌డీపీ–బయోఫిన్ సంయుక్తంగా జహీరాబాద్ పట్టణ సమీపంలోని డీడీఎస్, కేవీకేలో శనివారం నిర్వహించిన అగ్రోబయోడైవర్సిటీ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలన్నారు. సేంద్రియ ఎరువులను వాడటం వల్ల భూసారం పెరుగుతుందని చెప్పారు. ఎరువుల కొరత సమస్య నుంచి కూడా బయటపడతామని వివరించారు. అంతకుముందు కలెక్టర్ డీడీఎస్–కేవీకే ప్రదర్శించిన చిరుధాన్యాల స్టాళ్లను పరిశీలించారు.


