చేపల పంచాయితీ | - | Sakshi
Sakshi News home page

చేపల పంచాయితీ

Jun 7 2026 9:30 AM | Updated on Jun 7 2026 9:30 AM

చేపలు పట్టేందుకు వచ్చినపెద్దాపూర్‌ మత్స్యకారులు సభ్యత్వ వాటా ఇచ్చాకే పట్టుకోవాలన్న కన్‌సాన్‌పల్లి మత్స్యకారులు లేకుంటే అడ్డుకుంటాం పోలీసు బలగాల మోహరింపు

పెద్ద చెరువువద్ద హైటెన్షన్‌

వట్‌పల్లి(అందోల్‌)/అల్లాదుర్గం (మెదక్‌): అందోల్‌ మండల పరిధిలోని కన్‌సాన్‌పల్లి, అల్లాదుర్గ్‌ మండల పరిధిలోని గడిపెద్దాపూర్‌ గ్రామాల మధ్య విస్తరించి ఉన్న పెద్దచెరువు వద్ద శనివారం హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. వివరాలు ఇలా... చెరువులో చేపలు పట్టే హక్కు గడిపెద్దాపూర్‌ గ్రామానికి ఉండటంతో, తమకు దక్కాల్సిన వాటా ప్రకారం సభ్యత్వం కల్పించాలని కన్‌సాన్‌పల్లి మత్స్యకారులు గతంలో అధికారులను ఆశ్రయించారు. కాగా 33 మందికి పెద్దాపూర్‌ మత్స్య సహకార సంఘంలో సభ్యత్వం ఇవ్వాలని గతేడాది అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కానీ వారిని సంఘంలో చేర్చుకునే విషయమై పెద్దాపూర్‌ మత్స్యకారులు వ్యతిరేకించారు. సంఘంలో చేర్చుకోకుంటే వాళ్లు కూడా చేపలు పట్టేది లేదని అధికారులకు కన్‌సాన్‌పల్లి మత్స్యకారులు ఫిర్యాదు చేశారు. దీంతో పెద్దాపూర్‌ మత్య్సకారుల నుంచి అధికారులు చెరువు పన్ను తీసుకోలేదు. అధికారుల తీరును తప్పుబడుతూ వారు హైకోర్టును ఆశ్రయించి చేపలు పట్టేందుకు అనుమతి తీసుకున్నారు.

చెరువు వద్ద హైడ్రామా..

హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం తమకే చేపలు పట్టే హక్కు ఉందని పెద్దాపూర్‌ మత్స్యకారులు శనివారం పెద్ద చెరువు వద్దకు చేరుకున్నారు. వీరితో పాటు కన్‌సాన్‌పల్లి మత్స్యకారులు కూడా చెరువు వద్దకు వచ్చారు. విషయం తెలిసిన జోగిపేట సీఐ అనీల్‌కుమార్‌, అల్లాదుర్గ్‌ సీఐ రేణుక ఆధ్వర్యంలో పుల్కల్‌, వట్‌పల్లి, జోగిపేట పోలీస్‌స్టేషన్‌ బల గాలు చెరువు వద్ద మోహరించాయి. వీరితో పాటు మత్స్యశాఖ అధికారులు కూడా అక్కడికి చేరుకొని ఇరు గ్రామాల మత్స్యకారులను పిలిపించి మాట్లాడారు. కోర్టు ఆదేశాల ప్రకారం తమకే చేపలు పట్టేహక్కు ఉందని పెద్దాపూర్‌ పట్టుబట్టగా, అధికారిక ఉత్తర్వుల ప్రకారం తమకు సంఘంలో సభ్యత్వ వాటా ఇస్తేనే చేపలు పట్టనిస్తామని కన్‌సాన్‌పల్లి మత్స్యకారులు అనడంతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు, మత్స్యశాఖ అధికారులు కలుగజేసుకొని ఇరు గ్రామాల మత్స్యకారులతో గంటపాటు చర్చలు జరిపారు. రెండు రోజుల సమ యం తీసుకొని, మాట్లాడుకొని సామరస్య ధోరణితో ముందుకెళ్లాలని సూచించారు. దీంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జోగిపేట, పుల్కల్‌, వట్‌పల్లి ఎస్‌ఐలు పాండు,విశ్వజన్‌, శ్రీహరి, ఏఎస్‌ఐలు అంజయ్య, గౌస్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement