విధులు ముగించుకొని వస్తుండగా.. | - | Sakshi
Sakshi News home page

విధులు ముగించుకొని వస్తుండగా..

Jun 7 2026 9:18 AM | Updated on Jun 7 2026 9:18 AM

రామాయంపేట(మెదక్‌): రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... కోమటిపల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్‌ మహిపాల్‌ శివంపేట పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. విధులు ముగించుకొని రాత్రి బైక్‌పై స్వగ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో పట్టణ శివారులో సీడ్‌ కంపెనీ నుంచి రోడ్డుపైకి వస్తున్న లారీ ఒక్కసారిగా దూసుకొచ్చి బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిపాల్‌ లారీ కింద ఇరుక్కుపోయి గంటసేపు మృత్యువుతో పోరాడి మృతి చెందాడు. మృతునికి భార్యతో పాటు ఐదేళ్ల లోపు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం కోమటిపల్లిలో అధికార లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. ఏఎస్పీ విక్రాంత్‌ కుమార్‌ సింగ్‌, తూప్రాన్‌ డీఎస్పీ నరేందర్‌ గౌడ్‌ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మృతుని కుటుంబానికి అంత్యక్రియలు నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు. ఎస్‌ఐ బాలరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కారు ఢీకొట్టడంతో మహిళ..

నంగునూరు(సిద్దిపేట): ఇంటి ముందు నిద్రిస్తున్న మహిళ పైనుంచి కారు దూసుకెళ్లడంతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. రాజగోపాల్‌పేట ఎస్‌ఐ వివేక్‌ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బడే లక్ష్మి (54) వేసవి కావడంతో రోజు మాదిరిగానే శుక్రవారం రాత్రి ఇంటి ముందు పడుకుంది. ఈ క్రమంలో మద్దూర్‌కు చెందిన సలాది హరికృష్ణ కారులో వేగంగా వెళ్తూ ఆరుబయట నిద్రిస్తున్న లక్ష్మిపై నుంచి వెళ్లాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. అల్లుడు అనిల్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

అనుమానాస్పదంగా బాలుడు..

చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): అనుమానాస్పదంగా బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ రాములు వివరాల ప్రకారం... కౌడిపల్లి మండలం, పీర్ల తండాకు చెందిన దలావత్‌ వినోద్‌(14) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అదే తండాకు చెందిన దలావత్‌ సిద్ధార్థకు చిలప్‌చెడ్‌ గ్రామంలో బైక్‌ మెకానిక్‌ షాపు ఉంది. సెలవులు కావడంతో సిద్ధార్థతో కలిసి, వినోద్‌ చిలప్‌చెడ్‌ మెకానిక్‌ షాపునకు వచ్చాడు. ద్విచక్ర వాహనాలను కడిగే పైపు సహాయంతో వినోద్‌, తన బట్టలు ఉతుక్కునే క్రమంలో అకస్మాత్తుగా కిందపడ్డాడు. గమనించిన సిద్ధార్థ చుట్టు పక్కల వారి సహాయంతో వినోద్‌ను నర్సాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. కాగా వినోద్‌ తండ్రి మదన్‌, సిద్ధార్థను ఆరా తీయగా ఫిట్స్‌ వచ్చి కిందపడ్డాడని తెలిపాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ మృతి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement