రాయరావు చెరువుకు మహర్దశ | - | Sakshi
Sakshi News home page

రాయరావు చెరువుకు మహర్దశ

Jun 7 2026 9:18 AM | Updated on Jun 7 2026 9:18 AM

నర్సాపూర్‌: స్థానిక రాయరావు చెరువులో బోటింగ్‌తో పాటు చెరువును సుందరీకరణ చేసి పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. దీంతో నర్సాపూర్‌ మున్సిపాలిటీలో పర్యాటకంగా మరో అడుగు పడనుంది. ఇప్పటికే అటవీ శాఖ స్థానిక అడవుల్లో అర్బన్‌ పార్కు ఏర్పాటు చేయగా, సందర్శకుల తాకిడితో సందడిగా మారింది.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు నర్సాపూర్‌ 50 కిలోమీటర్ల చేరువలో ఉంది. నర్సాపూర్‌, హైదరాబాద్‌ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న శివారులోని అడవుల్లో అటవీ శాఖ ఏర్పాటు చేసిన అర్బన్‌ పార్కుకు మెదక్‌ జిల్లాతో పాటు సంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. ఈ పార్కు సమీపంలోని అడవులను ఆనుకుని రాయరావు చెరువు ఉంటుంది. చెరువుకు ఒక వైపు రెండు పెద్ద గుట్టలు ఉంటాయి. అవి ఎప్పుడు పచ్చని చెట్లతో దర్శనమిస్తున్నాయి. చెరువులో బోటింగ్‌ వసతి ఏర్పాటు చేస్తే చెరువును ఆనుకుని ఉన్న గుట్టలు పర్యాటకులను మరింత కనువిందు చేయనున్నాయి.

నర్సాపూర్‌ రాయరావు చెరువు

పర్యాటకంగా అభివృద్ధి

బోటింగ్‌, సుందరీకరణకు నిధులు మంజూరు

సుందరీకరణకు నిధులు..

స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి కృషితో ప్రభుత్వం చెరువులో బోటింగ్‌ ఇతర సదుపాయాలు కల్పించి పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రూ.2.5 కోట్లు మంజూరు చేసింది. కాగా చెరువులో బోటింగ్‌ సదుపాయం, చెరువు సుందరీకరణ, కట్టపై వాకింగ్‌ ట్రాక్‌, మొక్కలు పెంచడం, లైటింగ్‌ సదుపాయం, పర్యాటకులు కూర్చునేందుకు వీలుగా సీటింగ్‌ సదుపాయాలు కల్పించాలని పర్యాటక శాఖ సూచించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement