న్యాల్‌కల్(జహీరాబాద్): ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు పట్టుకున్నారు. శనివారం హద్నూర్ పోలీస్ స్టేషన్‌లో జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్, రూరల్ సీఐ హన్మంతు, ఎస్‌ఐ సుజిత్‌తో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 1న మండల పరిధిలోని తేజమ్మ పొలం వద్ద పనులు చేస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు బెదిరించి మెడలో ఉన్న తులంన్నర బంగారం, చెవుల కమ్మలు, సెల్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లారు. అనంతరం బసంత్‌పూర్‌లో పొలం వద్ద పనులు చేస్తున్న హిందూమతిని బెదిరించి ఆమె మెడలో ఉన్న బంగారు చైన్‌ను చోరీ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. శనివారం ఉదయం గంగ్వార్ చౌరస్తా వద్ద హద్నూర్ ఎస్‌ఐ సుజిత్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో బీదర్ వైపు నుంచి పల్సర్‌పై వస్తున్న ఇద్దరు యువకులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండా వెంబడించి పట్టుకున్నారు. నిందితులను విచారించగా ముంగి, బసంత్‌పూర్ గ్రామ శివారులో చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. నిందితులు బీదర్ జిల్లా చొండి తండాకు చెందిన అశోక్ ట్రాక్టర్ డ్రైవర్ కాగా, సురేశ్ కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. కాగా సంపాదించే డబ్బులు కుటుంబ పోషణకు సరిపోకపోవడం, చేసిన అప్పులు తీరకపోవడంతో చోరీల బాటపట్టారని తెలిపారు. నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి తులంన్నర బంగారం, రూ.15వేలు నగదు, బైక్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరు పలు చోరీ కేసుల్లో సైతం జైలుకు వెళ్లారని పోలీసులు తెలిపారు.
బంగారం, నగదు స్వాధీనం
వివరాలు వెల్లడించిన జహీరాబాద్ డీఎస్పీ


