తొగుట(దుబ్బాక): అప్పుల బాధ తట్టుకోలేక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని లింగాపూర్‌లో శణివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన తొంట నర్సింహులు, లక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. వారికున్న ఎకరం వ్యవసాయ భూమిని సాగు చేస్తూ, కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గత ఏడాది బంధువులు, తెలిసినవారి వద్ద అప్పులు చేసి పెద్ద కూతురు వివాహం చేశారు. అలాగే ఇళ్లు నిర్మించుకున్నారు. కూతురు వివాహానికి, ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు వడ్డీలతో కలిపి సుమారు రూ.10లక్షలు అయ్యాయి. ఈ క్రమంలో అప్పులిచ్చిన వారు తిరిగి చెల్లించాలని వేధించడంతో తీర్చేమార్గం లేక మనోవేదనకు గురయ్యాడు. శుక్రవారం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లివస్తానని ఇంట్లో చెప్పివెళ్లాడు. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో పొలం వద్దకు వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే కుటుంబీకులు 108లో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించాడని తెలిపారు.


