నారాయణఖేడ్: జొన్న కొనుగోలు కేంద్రాలకు పంట తెచ్చిన రైతులు కొనుగోళ్ల కోసం రెండు రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. మనూరు, నాగల్‌గిద్ద మండల కేంద్రాల్లో జొన్నల కొనుగోళ్లను మనూరు పీఏసీఎస్ సొసైటీ ద్వారా చేపట్టారు. అష్టకష్టాలు పడి టోకెన్లు పొందిన పలువురు రైతులు నాగల్‌గిద్ద పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రానికి జొన్నలు తీసుకురాగా రెండు రోజులుగా తూకం వేయడంలేదు. ఉజలంపాడ్, వల్లూరు తదితర గ్రామాలకు చెందిన రైతులు కేంద్రం వద్ద సరుకులను వాహనాల్లో ఉంచి వర్షంలోనే ఇబ్బందులు పడుతున్నారు. భోజనాలు తినకుండా అవస్థలు పడుతూ కేంద్రం వద్ద పడిగాపులు పడుతు న్నారు. రెండు రోజులు కావడంతో వాహనాల కిరాయి కూడా పెరిగిపోతుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికై నా తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.


