ఈ నెలలోనే స్కూళ్లు, సాగు ప్రారంభం
సంగారెడ్డి క్రైమ్ /సంగారెడ్డి టౌన్: జూన్ మాసం వచ్చిందంటే అటు పిల్లలను స్కూలుకు పంపించే తల్లిదండ్రులకు, ఇటు వ్యవసాయం చేసే రైతులకు భారీ ఖర్చులుంటాయి. ఈ నెలలో విద్యాసంస్థలు తెరుచుకోవడంతో పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజులు పెనుభారంగా మారుతున్నాయి. పిల్లల యూనిఫామ్, పుస్తకాలు అవసరాలకు లెక్కలు వేసుకుంటున్నారు. ఇంటి నుంచి పాఠశాలకు పిల్లల రవాణా వంటి ఖర్చులతో సతమతం అవుతుంటారు. తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చదివించాలనే అత్యాశతో ఆయా తల్లిదండ్రులు అప్పులపాలు కావలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
సాగు ఖర్చులు
జూన్ ప్రారంభంలోనే సాగు కోసం అన్నదాత అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. యుద్ధం కారణంగా పెరిగిన డీజిల్ ఖర్చులతో పాటు ఎరువులు, విత్తనాలకు ఖర్చు అవుతుంది. దానికి తోడు రోజురోజుకు పెరుగుతున్న గ్యాస్ ఖర్చులు పెను భారం అవుతున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచి డబ్బులను ఖర్చు చేసే పనులే ఉంటాయి.
భారీగా ఫీజులు
2026–27 విద్యాసంవత్సరానికి పట్టణంలో పలు ప్రైవేటు విద్యాసంస్థలు భారీగా ఫీజులు పెంచడంతో తల్లిదండ్రులపై తీవ్రత ప్రభావం పడుతుంది. ప్రీ ప్రైమరీ, యూకేజీ, ఎల్‌కేజీ తరగతుల్లో స్కూల్ ఫీజు, పుస్తకాలు, యూనిఫామ్, బస్‌ఛార్జీలతో కలిపి రూ.70 వేలకు పైగా అవుతున్నాయి. దీనికి తోడు అదనపు ఖర్చులన్నీ మరో పదివేలు మీద మీద పడుతున్నాయి. జిల్లాలో ఫీజుల నియంత్రణ లేకపోవడంతో కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ధరలు పెరిగాయి
పంటలు వేయడానికి కావలసిన విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేయాలంటే ధరలు పెరిగిపోయాయి. వీటికి తోడు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం.
– రాములు, రైతు, ఇరిగిపల్లి, సంగారెడ్డి
ఫీజుల మోత
పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చదివించాలంటే మరిన్ని అప్పులు చేయాల్సిన పరిస్థితి. రోజురోజుకు విద్యాసంస్థలు ఫీజులు పెంచుతున్నాయి. పుస్తకాలు, యూనిఫాం, తదితర రవాణా ఖర్చులతో భారం పడనుంది. – శాంతిప్రియ, గృహిణి, సంగారెడ్డి
పేద, మధ్య తరగతిపై భారం
ఫీజుల మోత, మరోవైపు నిత్యావసర ధరలు
అన్నదాతలకు సైతం సాగు పెట్టుబడులు


