దుబ్బాక: వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన దుబ్బాక పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ కీర్తి రాజు కథనం ప్రకారం... పట్టణానికి చెందిన ప్రైవేట్ వాహన డ్రైవర్‌గా ఆస సురేశ్(40) పనిచేస్తున్నాడు. డబుల్ బెడ్రూం కాలనీలో నివాసం ఉంటున్న అతడు ఓ మహిళకు ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపించాడు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఉదయమే ఇంట్లో నుంచి వెళ్లిన బోడోనికుంట వద్ద చెట్టుకు ఉరివేసుకున్నాడు. మృతుడి భార్య స్రవంతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
డబ్బుల విషయంలో మనస్తాపానికి గురై..
పటాన్‌చెరు టౌన్: డబ్బుల విషయంలో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్, గుంటూరుకు చెందిన శ్యామ్ కుమార్(25) నాలుగు నెలల క్రితం వచ్చి ఇస్నాపూర్ పరిధిలోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ స్థానికంగా ప్రైవేట్ కంపెనీలో పని పనిచేస్తున్నాడు. కాగా అతడికి రూ.2 లక్షల వరకు అప్పులున్నాయని..డబ్బులు కావాలని తన అన్న చక్రధారిని అడిగాడు. ఈ నెల 3న చక్రధర్ అతని భార్య నాగలక్ష్మితో కలిసి ఇస్నాపూర్‌కి వచ్చి తమ్ముడికి డబ్బుల విషయంపై మాట్లాడి వెళ్లిపోయారు. వారు వెళ్లిన మరుసటి రోజు బుధవారం శ్యామ్ కుమార్ బాత్రూంలో ఉరివేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి అన్న చక్రధర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
చికిత్స పొందుతూ యువకుడు..
దుబ్బాక: చికిత్స పొందుతూ యువకుడు శుక్రవారం మృతి చెందాడు. ఎస్‌ఐ కీర్తి రాజు తెలిపిన వివరాల ప్రకారం... దుబ్బాక పట్టణానికి చెందిన డెకరేషన్ పనులు చేసే కాల్వ నరేశ్(25) ఈ నెల 2న లచ్చపేట శివారులో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడు శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
భూ వివాదంలో యువకుడి ఆత్మహత్యాయత్నం
సిద్దిపేటరూరల్: ఓ యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం నారాయణరావుపేట మండలం లక్ష్మిదేవిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బాధిత యువకుడి తండ్రి నర్సింగోజు కృష్ణమూర్తి వివరాల ప్రకారం... గ్రామంలోని సర్వే నం. 1306లోని తమ కుటుంబ సభ్యులైన నర్సింగోజు విజయ్ కుమార్, నర్సింగోజు విష్ణుమూర్తిలకు సంబంధించి 585 గజాల స్థలాన్ని నారాయణరావుపేటకు చెందిన రఘువీర్ శాస్త్రికి విక్రయించారు. కాగా ఆయన 422 గజాల స్థలానికి మాత్రమే డబ్బులు చెల్లించి మిగతావి చెల్లించడం లేదు. ఈ విషయమై మాట్లాడుకునేందుకు గత ఆదివారం రఘువీర్ శాస్త్రి నారాయణరావుపేటకు పిలిపించాడు. అక్కడ మాట్లాడుకుంటున్న సమయంలో మాటామాటా పెరగడంతో ఆయన తన అనుచరులతో కలిసి నర్సింగోజు కృష్ణమూర్తి, విజయ్ కుమార్, అమర్‌పై దాడి చేశారు. దీంతో తమనే కొట్టి తమపై పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. డబ్బులు రాక, దాడికి గురై, చివరకు న్యాయం జరగడం లేదని మనస్తాపానికి గురైన నా కుమారుడు అమర్ గురువారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆస్పత్రికి తరలించామన్నారు. ఈ ఘటనపై ఎస్‌ఐ రాజేశ్‌ను వివరణ కోరగా.. ఇరువురు కొట్లాడుకున్న అనంతరం ఫిర్యాదు మేరకు అమర్‌పై కేసు నమోదు చేశామని, విచారణలో భాగంగా అమర్‌తో పాటు ఉన్న వ్యక్తుల వివరాలివ్వాలని కోరినా ఇవ్వలేదు. కేసును తప్పు దోవ పట్టించేందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు.


