మెదక్‌జోన్: మహిళలు, చిన్నారులపై జరిగే హింస, వేధింపుల కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. రక్షణ, వైద్య సహాయం, కౌన్సిలింగ్, పునరావాస సేవలు సమర్థ వంతంగా అందించాలని సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో భరోసా కార్యక్రమానికి సంబంధించి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళలు, చిన్నారులపై నమోదవుతున్న కేసు ల్లో వేగవంతమైన దర్యాప్తు జరగడంతో పాటు బాధితులకు అవసరమైన అన్ని సేవలు సకా లంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సేవల కల్పనలో పోలీసు శాఖతో పాటు ఇతర శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డీఎస్పీ ప్రసన్న కుమార్, భరోసా కో–ఆర్డినేటర్ సౌమ్యతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
నిధులు మంజూరు చేయాలని ఎంపీకి వినతి
మెదక్‌జోన్: ఉపాధ్యాయుల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్లా లక్ష్మణ్ ఎంపీని కోరారు. శుక్రవారం ఆయన తపస్ జిల్లా బాధ్యులతో కలిసి ఎంపీ రఘునందన్‌రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ భవనం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఎంపీని కలిసిన వారిలో తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాల సిద్దు, శ్రీధర్ రెడ్డి, ఆంజనేయులు, రాజు, కిషన్ పవర్, తదితరులు ఉన్నారు.
జీఓ 38ని పారదర్శకంగా అమలు చేయాలి
దుబ్బాక: ప్రభుత్వం వైద్యశాఖలో చేపడుతున్న ఆన్‌లైన్ బదిలీలను తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు జీఓ 38ని పారదర్శకంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట టీజీజీడీఏ ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని లేనిచో నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, డాక్టర్ హేమరాజ్‌సింగ్, ఏవీ శ్రీనివాస్, ముఖేశ్, ఐశ్వర్య, స్టాప్‌నర్సులు, తదితరులు ఉన్నారు.
వివాహిత అదృశ్యం
పటాన్‌చెరు టౌన్: వివాహిత అదృశ్యమైంది. ఈ సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... జేపీ కాలనీ డివిజన్‌కు చెందిన కుమార్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి భార్యాభర్తలు గొడవపడ్డారు. శుక్రవారం లేచి చూడగా భార్య రాధిక(40) కనిపించలేదు. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. భార్య కోసం తెలిసిన వారి వద్ద, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. భార్య అదృశ్యంపై కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రోడ్డు ప్రమాదంలో
ఒకరికి తీవ్రగాయాలు
వెల్దుర్తి(తూప్రాన్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... మండలంలోని ఓ మద్యం షాపు ఎదుట వెల్దుర్తి నుంచి జలాల్‌పూర్ వెళ్తున్న ఆటో, మెదక్ నుంచి వస్తున్న బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న మండలంలోని బండపోసాన్‌పల్లికి చెందిన తుమ్మల నితిన్(20)కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని పోలీసులు వాహనంలో ఆస్పత్రికి తరలించారు.


