చావ్‌రస్తాలు! | - | Sakshi
Sakshi News home page

చావ్‌రస్తాలు!

Jun 5 2026 10:21 AM | Updated on Jun 5 2026 10:21 AM

● నివారణ చర్యలు తీసుకోవడంలో జాప్యం ● 2023 జనవరిలో అల్గోల్‌ చౌరస్తాలోనే ట్రావెల్స్‌ బస్సు డీసీఎం వ్యాన్‌ను ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురుకి తీవ్రగాయాలయ్యాయి. ● రెండేళ్ల క్రితం అల్గోల్‌ చౌరస్తాలో టీవీఎస్‌పై రోడ్డు దాటుతున్న ఇద్దరిని కారు ఢీకొట్టగా వారిద్దరూ అక్కడిక్కడే చనిపోయారు. ● గతేడాది నవంబర్‌ 16న అల్గోల్‌ చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ● డిసెంబర్‌ నెలలో ఇదే చౌరస్తాలో బైక్‌పై రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందాడు. ● మే 10న జాతీయ రహదారిపై రాయిపల్లి(డి) చౌరస్తా వద్ద కారు లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ● జహీరాబాద్‌ బైపాస్‌ రోడ్డుతోపాటు పలు చౌరస్తాల్లో తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏడాదిలో 20కి పైగా ప్రమాదాలు చోటు చేసుకుని పది మంది వరకు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రతీ ఏటా ఇంతమంది ఉసురు తీస్తున్న చౌరస్తాలు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. అధికారులు ఈ ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యలు శూన్యం.

తరచూ ప్రమాదాలు
● నివారణ చర్యలు తీసుకోవడంలో జాప్యం

జహీరాబాద్‌ టౌన్‌: జాతీయ రహదారిపై పలు చౌరస్తాలు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. ఫోర్‌లేన్‌ రోడ్డుగా విస్తరించిన చౌరస్తాల వద్ద ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోనందున తరచూ అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరుగుతున్న ఈ ప్రాంతాలను ‘బ్లాక్‌స్పాట్‌’లుగా గుర్తించిన రోడ్లు భవనాల శాఖ అధికారులు అక్కడ అండర్‌ బ్రిడ్జిల నిర్మాణంలో మాత్రం ఎడతెగని జాప్యాన్ని ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్‌–ముంబై జాతీయ రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించి పట్టణం పక్కనుంచి బైపాస్‌ నిర్మించారు. బైపాస్‌ రోడ్డుపై ప్రధాన చౌరస్తాల వద్ద అండర్‌ బ్రిడ్జిలు నిర్మించనందున ప్రమాదాలు జరిగి చాలామంది వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. జహీరాబాద్‌ బైపాస్‌ రోడ్డులో అల్గోల్‌ చౌరస్తా, రాయిపల్లి(డి), కోహీర్‌ మండలంలోని దిగ్వాల్‌, కొత్తూర్‌(డి) చిత్తల్‌ఘాట్‌, హుగ్గెలి, బూచినెల్లి, సత్వార్‌ చౌరస్తాలు డెత్‌ స్పాట్‌లుగా మారాయి.

బ్లాక్‌స్పాట్‌గా అల్గోల్‌ చౌరస్తా

బైపాస్‌ రోడ్డులోని అల్గోల్‌ చౌరస్తా మరీ ప్రమాదకరంగా తయారైంది. అల్గోల్‌, భరత్‌నగర్‌,ఎల్గోయి, దిడ్గి, పొట్‌పల్లి తదితర గ్రామాల ప్రజలు చౌరస్తా దాటి వెళ్లాల్సి వస్తోంది. జాతీయ రహదారి కావడంతో వాహనాల రద్దీ అధికంగా ఉన్నందున రోడ్డు దాటేందుకు సైతం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి దాటే సమయంలో వేగంగా వస్తున్న వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరుగుతు న్నాయి. ఇప్పటివరకు పలు ప్రమాదాలు చోటుచేసుకుని పలువురు ప్రాణాలు కోల్పోగా ఎంతోమంది గాయపడ్డారు. అల్గోల్‌ చౌరస్తాను ‘బ్లాక్‌స్పాట్‌’గా గుర్తించి విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేశారు. వాహనాల వేగం నియంత్రించేందుకు స్పీడ్‌ బ్రేకర్లు, స్టాపర్లు ఏర్పాటు చేయలేదు. అల్గోల్‌లో చౌరస్తా విషయమై ఎమ్మెల్యే మాణిక్‌రావు ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసి చౌరస్తాలో అండర్‌ బ్రిడ్జి నిర్మించాలని కోరారు. అయినా ఇంతవరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. చౌరస్తాల వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రమాదకరంగా కల్వర్టు

జహీరాబాద్‌ పట్టణంలోని బస్టాండ్‌ నుంచి హౌసింగ్‌ బోర్డుకు వెళ్లే రోడ్డు మధ్యలో నిర్మించిన కల్వర్టు పూర్తిగా దెబ్బతింది. స్లాబ్‌ ధ్వంసమై గుంత పడి ఇనుపకడ్డీలు పైకి తేలడం వల్ల మోటారు బైక్‌ టైర్లు దెబ్బతింటున్నాయి. మున్సిపల్‌ అధికారులు స్పందించి వెంటనే దెబ్బతిన్న కల్వర్టుకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement